చంద్రబాబు అరెస్ట్ నే ఓ సంచలనం. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అట్టుడుకించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు కూడ గట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. కేవలం చంద్రబాబు అరెస్ట్ అన్నదే వైకాపా అజెండా కాదని, మరి కొన్ని అరెస్ట్ లు కూడా వున్నాయని గత కొన్ని రోజులుగా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో నారా లోకేష్ పేరు కూడా వుందనే వదంతులు కూడా వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ విషయం పార్టీ సానుభూతి పరుల్లో వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ అయిన రెండు రోజులకే లోకేష్ ను కూడా అరెస్ట్ చేయాలని స్కెచ్ వేసారని, అది తెలిసిన వెంటనే పవన్ ను ఆంధ్రకు రప్పించడం, లోకేష్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం జరిగిందని అంటున్నారు.
ఢిల్లీ వెళ్లి చంద్రబాబు అరెస్ట్ ను జాతీయ మీడియా దృష్టికి తెచ్చి, హైలైట్ చేయడంతో పాటు, కొంత మంది పెద్దల ద్వారా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తన అరెస్ట్ కు బ్రేక్ వేయించగలిగారని పార్టీ సానుభూతి పరులు చెబుతున్నారు.
ప్రస్తుతం లోకేష్ ఇంకా ఢిల్లీలోనే వున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ ల విషయంలో వైకాపా ముందుకు వెళ్తుందా.. జరుగుతున్న మీడియా హడావుడి నేపథ్యంలో వెనక్కు తగ్గుతుందా అన్నది చూడాలి. ఇదిలా వుంటే లోకేష్ సంగతి గాలి వార్తనా, గట్టివార్తనా అన్నది పక్కన పెడితే, మరి కొన్ని అరెస్ట్ లు అయితే వివిధ కేసుల్లో వుంటాయన్న వార్తలు అమరావతి లో గట్టిగానే వినిపిస్తున్నాయి.