కాంగ్రెస్ లో కీలక నేత సీడబ్ల్యూసీ మెంబర్ గా తాజాగా నామినేట్ అయిన కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బరామిరెడ్డి విశాఖ వైపు చూస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా విశాఖకి విమానంలో దిగారు. కాంగ్రెస్ పాత నేస్తాలతో కలసి సందడి చేశారు.
చాలాకాలంగా హైదరాబాద్ కే పరిమితం అయిన టీఎస్సార్ ఇపుడు ఉన్నట్టుండి విశాఖకు ఫ్లైట్ లో రావడం వెనక విషయం చాలానే ఉంది అంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు అని తెలుస్తోంది.
అందుకే ఆయన విశాఖ టూర్ ని పెట్టుకున్నారని అంటున్నారు. 1996, 1998లలో రెండు సార్లు విశాఖ నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున టీఎస్సార్ గెలిచారు. ఆ రెండు సార్లూ ప్రభుత్వాలు ఏణ్ణర్ధం వ్యవధిలో పడిపోయాయి. అలా అయిదేళ్ళ ఎంపీగా ఆయన పనిచేయలేకపోయారు.
మూడు సార్లు కాంగ్రెస్ ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. దేశంలో కాంగ్రెస్ కి రోజులు బాలేక ఆ అవకాశం లేకుండా పోయింది. 2024 ఎన్నికలకు ప్రెస్టేజ్ గా తీసుకున్న కాంగ్రెస్ ఏపీలో సైతం సీనియర్లను బరిలోకి దించాలని చూస్తోంది. కాంగ్రెస్ కి ఎంపీ సీట్లు కావాలి. ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ ఏపీలో ఎన్నికల వేళకు ప్రధాన పార్టీలతో పొత్తులు కుదురుతాయని ఆశాభావంతో ఉంది.
ఏపీలో అనూహ్య రాజకీయం సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉనారు. ఈ పరిణామాలే ఇండియా కూటమిలో ఆశలు పెంచుతున్నాయి. పొత్తులు ఉంటే కాంగ్రెస్ విశాఖ ఎంపీగా టీఎస్సార్ ని పోటీ చేయిస్తుంది అని అంటున్నారు. ఈ ఊహాగానాల నేపధ్యంలో టీఎస్సార్ విశాఖ రావడం రెండు రోజుల ముందుగానే తన బర్త్ డే వేడుకలను కాంగ్రెస్ నాయకుల మధ్యలో జరుపుకోవడం విశేషం.
తాను విశాఖ ఒక్కటే తమది విడదీయలేని బంధం అని టీఎస్సార్ అంటున్నారు. ఈసారి శివరాత్రిని గ్రాండ్ గా చేస్తామని ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో శివరాత్రితో టీఎస్సార్ ఎన్నికల జాతర విశాఖలో మొదలవుతుందని అంటున్నారు