ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది ప్రజల కోసమేనా?

రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి, ములాఖత్ లో తన భర్త చంద్రబాబును కలిసి, బయటకొచ్చి మాట్లాడిన భువనేశ్వరి వ్యాఖ్యల్ని నటుడు, దర్శకుడు, ఏపీఎఫ్ డీ సీ ఛైర్మన్ పోసాని తీవ్రంగా ఖండించారు. తన భర్త…

రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి, ములాఖత్ లో తన భర్త చంద్రబాబును కలిసి, బయటకొచ్చి మాట్లాడిన భువనేశ్వరి వ్యాఖ్యల్ని నటుడు, దర్శకుడు, ఏపీఎఫ్ డీ సీ ఛైర్మన్ పోసాని తీవ్రంగా ఖండించారు. తన భర్త నిరంతరం ప్రజల కోసం మాత్రమే ఆలోచించారని, ఏ పని చేసినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేశారని అన్నారు భువనేశ్వరి. ఈ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ వేశారు పోసాని.

“మా ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే పని చేస్తున్నాడని భువనేశ్వరి గారు చెబుతున్నారు. మీ ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉన్నాడు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. అదే కాంగ్రెస్ ను ఓ తన్నుతన్ని టీడీపీలోకి ఎందుకొచ్చాడు. ప్రజాసేవ కోసమా? ఎన్టీఆర్ ను మీ ఆయన చెప్పుతో కొట్టించాడు. అది ప్రజల కోసమేనా? తెలుగుదేశం ఎమ్మెల్యేలందర్నీ కొనేసి, మీ నాన్న రామారావును వెన్నుపోటు పొడిచాడు మీ ఆయన. రామారావు కూర్చోవాల్సిన సీటులో మీ ఆయన కూర్చున్నాడు. ప్రజల కోసమేనా? తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడేయడానికి, ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి డబ్బులు కూడా పంపించాడు మీ ఆయన. అది ప్రజల కోసమా? ఈ ప్రశ్నలకు జవాబు చెబితే, నేను మరో 10 మందికి చెబుతా.”

ఇలా భువనేశ్వరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే, చంద్రబాబు నిజ స్వరూపాన్ని మరోసారి గుర్తుచేశారు పోసాని. జగన్ కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మందిని, చంద్రబాబు ప్రలోభపెట్టి తనవైపు లాక్కున్నారని, అది కూడా ప్రజల కోసమేనా అని ప్రశ్నించారు.

చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడూ నిజాయితీగా గెలవలేదని, అవినీతి, వెన్నుపోట్లు, మేనేజ్ మెంట్లు చేస్తూ రాజకీయ జీవితాన్ని నెట్టుకొచ్చారని ఆరోపించారు పోసాని. తను చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి అబద్ధమని నిరూపించినా, మరో ప్రెస్ మీట్ పెట్టి, మీడియా ముందు తన చెప్పుతో తాను కొట్టుకుంటానని సవాల్ విసిరారు పోసాని.