సౌత్ లో 'సాహో' కలెక్షన్ల లెక్కలను ట్రేడ్ వర్గాలు ఇప్పుడు పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా లేవు. అయితే హిందీలో మాత్రం ఈ సినిమా వసూళ్ల లెక్కలు సాగుతూ ఉన్నాయి. మూడోవారానికి ఈ సినిమా 150 రూపాయల వసూళ్ల మార్కును అధిగమించిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 'సాహో' షేర్ వసూళ్లు హిందీలో 153 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని బాక్సాఫీస్ పండితులు ప్రకటించారు.
ఇలా ఈ సినిమా నూటాయాభై కోట్లరూపాయల వసూళ్ల మార్కును అధిగమించినట్టు అయ్యింది. ఈ సినిమాకు సౌత్ కు ధీటుగా నార్త్ లో కలెక్షన్స్ లభించిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ లోనే బాలీవుడ్ లో ఈ సినిమా దూకుడు చూపించింది. ఆ ప్రభావం అలాగే కొనసాగుతున్నట్టే. తెలుగు వారితో పోలిస్తే హిందీ జనాలకు ఈ సినిమా బాగా నచ్చిందని కూడా ఈ వసూళ్లను బట్టి అంచనా వేయవచ్చు. ఒక సౌత్ హీరో సినిమా హిందీలో నూటా యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం అంటే మాటలు కాదు.
అది కూడా పూర్తి నెగిటివ్ రివ్యూలను తట్టుకుని ఈ సినిమా ఆ వసూళ్లను సాధించింది. ఈ సినిమా పట్ల హిందీ రివ్యూయర్లు దుమ్మెత్తిపోశారు. ఐదుకి ఒకటీ, అర రేటింగులు కూడా ఇచ్చారు. అయినా ఈ స్థాయి వసూళ్లు సాధించడం మాత్రం గమనార్హం.