హీరోయిన్ సాయిపల్లవి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. ఆమె నటించిన సినిమాలన్నీ 2 నెలల గ్యాప్స్ లో ఒకటి తర్వాత ఒకటి థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాయి. కరోనా/లాక్ డౌన్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
సాయిపల్లవి నుంచి ముందుగా రాబోతున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడు వెంటనే ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, మంచి డేట్ దొరకనప్పటికీ సినిమాను వదిలేయాలనే నిర్ణయించుకున్నారు.
లవ్ స్టోరీ వచ్చిన మినిమం గ్యాప్ లోనే విరాటపర్వం సినిమా కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఇది కూడా చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ప్రాజెక్టు. రానా ఆరోగ్య పరిస్థితి బాగాలేక కొన్నాళ్లు, లాక్ డౌన్ వల్ల ఇంకొన్నాళ్లు ఈ సినిమా ఆలస్యమౌతూ వస్తోంది. ఇందులో రానా మావోయిస్టుగా నటిస్తే, ఆమెను ప్రేమించే పల్లెటూరి పిల్ల పాత్రలో సాయిపల్లవి కనిపిస్తోంది.
థియేటర్లు తెరిచిన తర్వాత పరిస్థితుల బట్టి, లవ్ స్టోరీ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అయితే.. విరాటపర్వం సినిమా సెప్టెంబర్ లో థియేటర్లలోకి వస్తుంది. ఆ తర్వాత 2-3 నెలల గ్యాప్ లో శ్యామ్ సింగరాయ్ కూడా థియేటర్లలోకి వచ్చేస్తుంది.
నాని-సాయిపల్లవి జంటగా తెరకెక్కుతోంది శ్యామ్ సింగరాయ్ మూవీ. రాహుల్ సంకృత్యాన్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని నాని డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గట్టే కాల్షీట్లన్నీ ఈ సినిమాకే కేటాయించాడు. నిజానికి టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్ తో పాటు ''అంటే..సుందరానికి'' సినిమాను కూడా ఇదే ఏడాదిలో రిలీజ్ చేద్దామనుకున్నాడు నాని. అయితే టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలు మాత్రమే ఈ ఏడాది థియేటర్లలోకి రాబోతున్నాయి.
అలా సాయిపల్లవి నుంచి రాబోయే 6 నెలల కాలంలో 3 సినిమాలు రాబోతున్నాయి. ఈ 3 సినిమాల్లో 3 విలక్షణమైన పాత్రలు పోషించింది ఈ హీరోయిన్.