రాబోయే రోజుల్లో తనను ఏ మాధ్యమంలో కావాలంటే అందులో చూడొచ్చని చెబుతోంది తమన్న. ఇకపై సినిమాలతో పాటు ఓటీటీకి కూడా సమప్రాధాన్యం ఇస్తానని చెబుతోంది. మారుతున్న కాలానికి, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు మనం కూడా మారాలని, ఆ విషయంలో ఇతర నటీనటులతో పోలిస్తే తను కాస్త ముందున్నానని చెబుతోంది మిల్కీబ్యూటీ.
సినిమాలు, పాత్రల ఎంపిక విషయంలో తను ఎలాంటి ఫార్ములాలు ఫాలో అవ్వనని చెబుతోంది తమన్న. కెరీర్ కు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించడమే తను చేస్తున్న పనిగా చెప్పుకొచ్చింది. సినిమాలు, పాత్రల విషయంలో ఎప్పుడైతే బోర్ ఫీలవుతామో అప్పుడు కెరీర్ కష్టాల్లో పడినట్టు గుర్తించాలని చెబుతోంది.
సీటీమార్ సినిమాలో ఫిమేల్ కబడ్డీ కోచ్ గా కనిపిస్తోంది తమన్న. గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో షాకింగ్ పాత్రలో కనిపించబోతోంది. మ్యాస్ట్రోలో లేడీ విలన్ పాత్రలో నటిస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించే పాత్రలు ఎంపిక చేసుకుంటూ వెళ్తుంటానని.. వీటికి తోడు ఓటీటీలో కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తుంటానని చెప్పుకొచ్చింది తమన్న.
“నా పాత్రల ఎంపికలో చాలా సెన్సిటివ్ గా, కేర్ ఫుల్ గా వ్యవహరిస్తాను. ఎందుకంటే నేను పోషించే పాత్రలతో అంతా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటాను. అదే టైమ్ లో చేసే పాత్ర నాకు బోర్ కొట్టకుండా జాగ్రత్త పడతాను.”
ఇలా కెరీర్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ దూసుకుపోతోంది తమన్న. సినీ పరిశ్రమలన్నీ మళ్లీ గాడిన పడిన తర్వాత, ఓటీటీలో నటించడం ఆపేయనంటోంది. ఆడియన్స్ తనను ఓటీటీ లేదా సిల్వర్ స్క్రీన్ లో ఎక్కడైనా చూడొచ్చని చెబుతోంది.