తెలుగులో పలు సినిమాల్లో నటించి, ఆ తర్వాత వివాహంతో ఒక రాజకీయ కుటుంబానికి కోడలై, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా నెగ్గి మళ్లీ అందరికీ పరిచయం అయిన నవనీత్ కౌర్, ఇప్పుడు తన ఎంపీ పదవిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిందని బాంబే హై కోర్టు ధ్రువీకరించడంతో ఆమె పదవి ఊడుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తను ఎస్సీనంటూ నవనీత్ కౌర్ సమర్పించిన కులధ్రువీకరణ పత్రం నకిలీది అని కోర్టు నిర్ధారించింది.
ఆ సర్టిఫికెట్ ను రద్దు చేస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన రాజకీయ నేతల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి పదవులు ఊడే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ కూడా మాజీ ఎంపీ అయిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
తను చర్మకారుల కులానికి చెందినదానినంటూ నవనీత్ కౌర్ తన కుల ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నదట. అయితే ఆమె బర్త్ సర్టిఫికెట్ లో అలాంటి వివరాలు ఏమీ లేవని, ఆమె చర్మకారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోలేకపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని కోర్టు రద్దు చేసింది. ఈ వివరాలు తప్పుడువి అని నిర్ధారణ అయిన నేపథ్యంలో నవనీత్ పై లోక్ సభస్పీకర్ వేటు వేసే అవకాశాలు ఉంటాయి.
అయితే తీర్పు ఇంకా బాంబే హైకోర్టు స్థాయిలోనే ఉంది కాబట్టి, నవనీత్ కు ఇంకా అవకాశాలు ఉండవచ్చు. ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉండవచ్చు. అంతలోపే ఆమెను ఎంపీగా అనర్హురాలిగా ప్రకటిస్తారా అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఎస్సీ రిజర్వడ్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా నెగ్గింది నవనీత్ కౌర్. ఆమె ఎస్సీ కాదని కోర్టు నిర్ధారించడంతో ఈ వివాదం రేగుతోంది.