ఖాకీలకు కులం కార్డు.. బాబు నీచ రాజకీయం

చంద్రబాబు నాయుడు ఖాకీలపై కక్షగట్టారు. పదే పదే పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు, చేయిస్తున్నారు. తాజాగా గవర్నర్ కి కూడా లేఖ రాసిన బాబు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ని పోలీసులు వేధిస్తున్నారని, ఏపీలో ఫ్రెండ్లీ…

చంద్రబాబు నాయుడు ఖాకీలపై కక్షగట్టారు. పదే పదే పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు, చేయిస్తున్నారు. తాజాగా గవర్నర్ కి కూడా లేఖ రాసిన బాబు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ని పోలీసులు వేధిస్తున్నారని, ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలయ్యేలా చూడాలని కోరారు. 

విచిత్రం ఏంటంటే.. గవర్నర్ కి రాసిన లేఖలో చంద్రబాబు పోలీసుల్లో ఓ వర్గం అంటూ ప్రస్తావించడం. ఏపీ పోలీసులను బాబు తనకి అనుకూలంగా వర్గాలుగా విభజించారనమాట. అలా విభజించి మరీ ''ఆ వర్గం'' అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

కుల, మత, వర్గాల పేరుతో ఆల్రెడీ ప్రజల్ని విభజించి రాజకీయాలు చేశారు చంద్రబాబు. మహానాడులో కూడా ఈ కులకంపే. ఇప్పుడు అధికారుల్ని, పోలీసు సిబ్బందిని కూడా ఇలా వర్గాల పేరుతో విడదీయాలనుకుంటున్నారు బాబు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జరిగిన పోలీస్ ట్రాన్స్ ఫర్ల పై కూడా చంద్రబాబు ఇలాగే వర్గం ముద్ర వేశారు. కులం పేరుతో విభజించారు. ఇప్పుడు కూడా ఓ వర్గం అంటూ కొంతమందిని విడగొట్టి, పరోక్షంగా ఆ రెండో వర్గానికి టీడీపీపై సింపతీ పుట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు చంద్రబాబు. మరోసారి నీఛ రాజకీయాలకు దిగారు.

చంద్రబాబు హయాంలో చేసిన తప్పులకి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు కొంతమంది ఉన్నతాధికారులు. కానీ వైసీపీ హయాంలో అలాంటి పక్షపాత ధోరణులు ఎక్కడా లేవనే చెప్పాలి. అవినీతిపరులైన మాజీ మంత్రులు, హత్య కేసులో ఇరుక్కున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయొద్దంటే ఎలా..? 

శాంతి భద్రతల రక్షణ పోలీసుల బాధ్యతా..? లేక నువ్వు ఏ పార్టీ అని తెలుసుకుని మరీ విచారణ చేపట్టడం పోలీసుల విధుల్లో భాగమా..? తప్పు చేసిన వారు ఏ పార్టీవారని చూసే తీరిక పోలీసులకు ఉండదు. అదే నిజమైతే.. ఈపాటికి టీడీపీ నేతలు, కార్యకర్తలంతా జైళ్లలోనే ఉండాలి కదా?

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర పనిఒత్తిడి పెట్టి వేధించేవారు. దానికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు పోలీసులపై పడ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న చంద్రబాబు.. అసలు ఏనాడైనా వారి కష్టాలు పట్టించుకున్నారా..?

జగన్ సీఎం అయిన తర్వాతే పోలీసులకు వీక్లీ ఆఫ్ లు మంజూరయ్యాయి, హోం గార్డుల జీతాలు పెరిగాయి, పోలీసింగ్ కొత్తరూపు సంతరించుకుంది. దిశ పోలీస్ స్టేషన్లు, సత్వర విచారణలతో.. ప్రజల్లో భరోసా నెలకొల్పారు జగన్. ఇవన్నీ కళ్లముందు కనపడుతున్న వాస్తవాలు.

అటు చంద్రబాబు మాత్రం పోలీసులకు కూడా సామాజిక వర్గం కార్డు ఆపాదించాలని చూస్తున్నారు. ఖాకీలపై కక్షగట్టిన చంద్రబాబు.. చివరకు ఏం సాధించాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి.