వేవ్ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ అంచ‌నాలు నిజ‌మే!

కోవిడ్-19 వేవ్ గురించి భార‌తీయ ప‌రిశోధ‌కులు వేస్తున్న అంచ‌నాలు చాలా వ‌ర‌కూ నిజం అవుతున్నాయి.  వాస్త‌వానికి రెండో వేవ్ క‌రోనా విష‌యంలో కూడా కొంద‌రు ప‌రిశోధ‌కులు ముంద‌స్తుగా హెచ్చ‌రించారు.  గ‌త ఏడాది డిసెంబ‌ర్ స‌మ‌యానికి…

కోవిడ్-19 వేవ్ గురించి భార‌తీయ ప‌రిశోధ‌కులు వేస్తున్న అంచ‌నాలు చాలా వ‌ర‌కూ నిజం అవుతున్నాయి.  వాస్త‌వానికి రెండో వేవ్ క‌రోనా విష‌యంలో కూడా కొంద‌రు ప‌రిశోధ‌కులు ముంద‌స్తుగా హెచ్చ‌రించారు.  గ‌త ఏడాది డిసెంబ‌ర్ స‌మ‌యానికి చాలా వ‌ర‌కూ కేసులు త‌గ్గిపోయినా, తిరిగి ఫిబ్ర‌వ‌రి నుంచి సెకెండ్ వేవ్ లో క‌రోనా వ‌స్తుంద‌ని కొంద‌రు ప‌రిశోధ‌కులు బ‌హిరంగంగానే చెప్పారు. అయితే ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది.

ఎన్నిక‌ల‌ను ఎడాపెడా నిర్వ‌హించారు. స్వ‌యంగా ప్ర‌ధాని, కేంద్ర హోం మంత్రి.. తాము ప్ర‌తిష్ట‌గా తీసుకున్న రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగి తేలారు. ఆ లోపే క‌రోనా చాప కింద నీరులా వ్యాపించింది.  సెకెండ్ వేవ్ నియంత్రించ‌లేనంత స్థితికి చేరింది. అపార‌న‌ష్టం జ‌రిగింది. తీరా ఇప్పుడేమో కోవిడ్ ను జ‌యించిన‌ట్టుగా కేంద్రం ప్ర‌క‌టించుకుంటోంది అప్పుడే! 

ఆ సంగ‌త‌లా ఉంటే.. సెకెండ్ వేవ్ వ్యాప్తి తీవ్రం అయిన ద‌శ‌లో ప‌లువురు వైరాల‌జిస్టులు, వ్యాక్సినోల‌జిస్టులు వేసిన అంచ‌నాలు దాదాపు నిజం అవుతున్నాయి. సెకెండ్ వేవ్ మే నెల ద్వితీయార్థం నుంచి త‌గ్గుముఖం ప‌ట్ట‌వ‌చ్చ‌ని ప‌లువురు వైరాల‌జిస్టులు, అధ్య‌య‌న సంస్థ‌లు అంచ‌నా వేశాయి. వారి అంచ‌నాలు దాదాపు నిజం అయ్యాయి.

దేశంలో రోజువారీ కేసుల సంఖ్య రోజుకు ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కూ చేరొచ్చ‌ని కొన్ని అధ్య‌య‌న సంస్థ‌లు అంచ‌నా వేశాయి, ఆ త‌ర్వాత క‌రోనా తగ్గుముఖం ప‌డుతుంద‌ని కూడా అవి చెప్పాయి. ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాల ప్ర‌కార‌మే దేశంలో రోజుకు నాలుగు ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి ఒక ద‌శ‌లో. ఆ స‌మ‌యంలో అన‌ధికారికంగా రోజుకు ఈజీగా మ‌రో ల‌క్ష కేసుల‌పైనే న‌మోద‌యి ఉంటాయ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా రోజువారీ కేసులు సంఖ్య సుమారు ఐదు ల‌క్ష‌ల స్థాయిలో న‌మోద‌యిన‌ట్టే. ఆ త‌ర్వాత నెమ్మ‌ది నెమ్మ‌దిగా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. 

పక్షం రోజుల వ్య‌వ‌ధిలోనే యాక్టివ్ కేసుల సంఖ్య స‌గానికి స‌గం త‌గ్గిపోయింది. ఇప్పుడు దేశంలో క‌రోనా రోజువారీ కేసుల సంఖ్య ల‌క్ష లోపు న‌మోద‌వుతున్నాయి. వ‌ర‌స‌గా రెండో రోజు ల‌క్ష‌లోపే క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇదే త‌గ్గుద‌ల కొన‌సాగుతుంద‌ని ప‌రిశోధ‌కులు ఇది వ‌ర‌కే అంచ‌నా వేశారు. ఈ నెలాఖ‌రుకు క‌రోనా కేసులు పూర్తిగా త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని అధ్య‌య‌న‌క‌ర్త‌లు చెప్పారు.  జూన్ నెలాఖ‌రుకు రోజువారీ కేసుల సంఖ్య రెండు వేల స్థాయికి త‌గ్గుతుంద‌నే అంచ‌నాలు, అభిప్రాయాలు ఇది వ‌ర‌కే వినిపించాయి. బ‌హుశా ఆ అంచ‌నాలే నిజం అయ్యే అవ‌కాశాలు కూడా కనిపిస్తున్నాయిప్పుడు. 

సెకెండ్ వేవ్ గురించి ప్రిడిక్ట్ చేసిన వారి అంచ‌నాల‌ను ఇక ముందు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌త్యేకించి వైరాల‌జిస్టుల అభిప్రాయాల‌కు ప్ర‌భుత్వాలు ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తూ ఉంది.