సాయిధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ రోడ్డు యాక్సిడెంట్ లో అతడు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ప్రమాదం జరిగిన టైమ్ లో అక్కడే ఉన్న సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి వెంటనే స్పందించాడు. సాయితేజ్ ను గుర్తించి అతడ్ని హాస్పిటల్ లో చేర్పించాడు.
అంతే.. అప్పట్నుంచి ఫర్హాన్ కు కష్టాలు మొదలయ్యాయి. సాయితేజ్ ను కాపాడిన తర్వాత ఫర్హాన్ కు మెగా ఫ్యామిలీ నుంచి భారీగా రివార్డులు అందాయని.. కారు, బంగ్లా లాంటివి కూడా వచ్చాయని చాలా కథనాలు వచ్చాయి. వీటిపై ఫర్హాన్ తాజాగా స్పందించాడు.
మెగా ఫ్యామిలీ నుంచి కానీ, సాయిధరమ్ తేజ్ నుంచి కానీ తనకు ఎలాంటి డబ్బు అందలేదని స్పష్టం చేశాడు ఫర్హాన్. తనకు భారీగా బహుమతులు, నగదు అందిందంటూ చుట్టుపక్కల జనాలు ట్రోల్ చేస్తున్నారని, దీంతో చేస్తున్న ఉద్యోగం కూడా పోయిందని వాపోయాడు.
దీనిపై సాయిధరమ్ తేజ్ కు వ్యతిరేకంగా కథనాలు రావడం మొదలయ్యాయి. ఈ అంశంపై వెంటనే స్పందించాడు సాయితేజ్. తన ప్రాణాలు కాపాడిన ఫర్హాన్ కు ఎంతోకొంత డబ్బు ఇచ్చి రుణం తీర్చుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. ఫర్హాన్ కు తన కాంటాక్ట్ డీటెయిల్స్ అందించామని, అతడికి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించాడు.
ఈ మేరకు ఫర్హాన్ తో తన మేనేజర్ శరణ్ టచ్ లో ఉన్నాడని, అదే విధంగా ఫర్హాన్ కు కూడా శరణ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని తెలిపాడు సాయితేజ్. ఈ విషయంపై ఇకపై స్పందించనని, ఇదే తన చివరి వివరణ అని కూడా స్పష్టం చేశాడు.
సాయం చేసిన వ్యక్తిని మరిచిపోయేంత కఠినుడ్ని కాదని, ఫర్హాన్ కు ఎప్పుడు ఏ సాయం కావాలన్నీ తను అందుబాటులో ఉంటానని చెబుతూ.. ఓ వీడియో క్లిప్ ను కూడా జోడించాడు సాయితేజ్. తాజా ప్రకటనతో ఈ అంశంపై ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.