ఒకప్పుడు ఆ సోదరులు తాడిపత్రి శాసనకర్తలు. వాళ్లు చెబితే అంతే. తిరుగులేదు. ఒకరు రాజు, ఇంకొకరు రారాజు. వాళ్లే జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి. జేసీ బ్రదర్స్‌గా పేరు.
కాలం ప్రతి ఒక్కరికీ తన ఆట చూపిస్తుంది. ఇప్పుడు బ్రదర్స్‌కి చూపిస్తోంది. కింగ్స్ కాస్త జోకర్స్‌గా మారిపోయారు. తాడిపత్రి వాళ్ల రాజ్యం, కంచుకోట. పోలీసులైనా, అధికారులైనా, విలేకరులైనా వాళ్ల ముందు నిలబడాల్సిందే. ప్రెస్‌మీట్ పెడితే కుర్చీలో కూచోకుండా, నిలబడి రాసుకునే దుస్థితి. కూచుంటే బ్రదర్స్‌కి కోపం వస్తుందని భయం. ఎవరైనా వాళ్లకి వ్యతిరేకంగా రాస్తే వాళ్ల పని అయిపోయినట్టే. వీళ్ల నిధులతో నడిచే లోకల్ పత్రికల్లో ఆ విలేకరుల గురించి గలీజ్ రాతలు వస్తాయి. లొంగిపోయిన వాళ్లు ప్రశాంతంగా జీవిస్తారు. సాక్షి ఆఫీస్‌పై పెట్రోల్ పోసి దాడి చేస్తే ఒక ఉద్యోగి మరణించాడు. ఆ కేసులో బ్రదర్స్‌కి వ్యతిరేకంగా ఒక సాక్షి కూడా ముందుకు రాలేదు.
85 నుంచి దివాకర్‌రెడ్డి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 83లో మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. పరిటాల రవి హవా నడిచే రోజుల్లో ఒకసారి మాత్రం జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయలేకపోయారు.
గత ఎన్నికల్లో వాళ్లు పోటీ చేయలేదు. వాళ్ల పిల్లలు ఓడిపోయారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రాజ్యంలోకి ప్రవేశించి బ్రదర్స్‌కి సవాల్ విసిరారు. అయితే ఆయన అతి విశ్వాసం మున్సిపల్ ఎన్నికల్లో ఓడించింది. వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడంతో ప్రభాకర్‌రెడ్డి గెలిచారు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బ్రదర్స్ ఇప్పుడు పొలిటికల్ కామెడీ చేస్తున్నారు. రాయలతెలంగాణ అని సాధ్యం కాని స్టేట్‌మెంట్స్‌తో అన్న నవ్వులపాలవుతుంటే, రోడ్డు మీద స్నానం చేస్తూ తమ్ముడు నవ్విస్తున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు రాయలసీమను తెలంగాణలో కలపాలని బిగ్ బ్రదర్ డిమాండ్.
40 సంవత్సరాల నుంచి నాయకుడిగా వుంటూ ఎన్నో మంత్రి పదవులను అనుభవించిన ఆయన సీమ ప్రజలకి ఏం చేశారో చెబితే బాగుంటుంది. 83లో ఆయన ఆస్తులెంత? ఇప్పుడెంత? 40 ఏళ్ల క్రితం సీమలో నీటిపారుదల ఎన్ని ఎకరాలకి? ఇప్పుడెంత? ఇవన్నీ లెక్కలేస్తే ఆయన రైతుల కోసం చేశాడా? సొంత పనులు చేసుకున్నాడో తేలిపోతుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రతిపక్షం లేకుండా చేసి, ఎవరినీ నోరు మెదపకుండా చేసిన ప్రభాకర్‌రెడ్డి ఈ రోజు అవినీతి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు.
ప్రజలు పైకి నోరు మెదపకపోయినా బ్రదర్స్‌కి కరెక్ట్ మొగుడు పెద్దారెడ్డే అని నమ్ముతున్నారు. దశాబ్దాల పాటు చంద్రబాబుని బండబూతులు తిట్టిన బ్రదర్స్, ఈ రోజు బాబుకి, లోకేశ్‌కి తాళం వేయడం చూసి ఇదంతా పెద్దారెడ్డి, ఆయన వెనకున్న జగన్ వల్లే సాధ్యమైందని జనం సంతోషిస్తున్నారు.