అన్నీ మనం అనుకున్నట్టు జరగవు – సమంత

సమంత, మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి ఆమె దాదాపు కోలుకుంది. దీనికి సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.…

సమంత, మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి ఆమె దాదాపు కోలుకుంది. దీనికి సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. సమంతకు మయోసైటిస్ సోకి సరిగ్గా ఏడాది గడిచిందట. ఈ ఏడాదిలో తను ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు, సాగించిన పోరాటాన్ని వెల్లడించింది సమంత.

“వ్యాధి నిర్ధారణ జరిగి ఏడాది అయింది. అతి కష్టమ్మీద సాధారణ స్థితికి రాగలిగాను. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశాను. ఉప్పు, చక్కెర లేదా ఆహారధాన్యాలు పూర్తిగా కట్ అయ్యాయి. మందులే నాకు ఆహారమయ్యాయి. ఎంతో కష్టంతో కొన్ని ఆపేయాల్సి వచ్చింది, మరికొన్ని కష్టమైనప్పటికీ ప్రారంభించాల్సి వచ్చింది. ఈ ఏడాదిలో జీవితానికి అర్థం తెలుసుకున్నాను, ఆత్మపరిశీలన చేసుకున్నాను. కెరీర్ లో వైఫల్యాలపై కూడా సమీక్షించుకున్నాను.”

ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా బయటపెట్టింది సమంత. జీవితంలో ఎన్నడూ లేనంతగా, ఈ ఏడాది కాలంలో ఎన్నో పూజలు, వ్రతాలు చేసిందట సమంత. అయితే ఆ పూజలతో దేవుడ్ని వరాలు, బహుమతుల కోరలేదంట. శారీరకంగా దృఢంగా తయారవ్వాలని, మానసికంగా ప్రశాంతంగా ఉండాలని మాత్రమే కోరుకుందట.

“జీవితంలో కొన్నిసార్లు ప్రతిది మనం అనుకున్నట్టు జరగదనే విషయాన్ని ఈ ఏడాది కాలంలో తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా మనం అనుకున్నది జరగనప్పుడు సరిపెట్టుకోవడం నేర్చుకున్నాను. మన అదుపులో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని అనుకోవడం తప్పని, చేయాల్సిన పనిని మాత్రమే చేసి, ముందుకు సాగాలని తెలుసుకున్నాను. ప్రతిది పెద్ద సక్సెస్ తోనే రాదు, ప్రతికూల పరిస్థితులు దాటి ఒక్క అడుగు ముందుకేయడం కూడా గెలుపే.”

ఈ ఏడాది కాలంలో మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత.. గతం గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదని చెబుతోంది. అందర్నీ ప్రేమించాలి.. ప్రేమను పంచే వాళ్లతో ఎక్కువగా ఉండాలని సూచిస్తోంది. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేసినా, శాంతి-ప్రేమ-శక్తి కోరుకునే వాళ్లను ఎప్పుడూ తిరస్కరించడంటూ తన పోస్టును ముగించింది సమంత.

Click Here For Photo Gallery