ది ఫ్యామిలీ మేన్ సీజన్-2లో రాజీ అనే పాత్రలో సమంత కనిపించిన విషయం తెలిసిందే. ఆమె తొలి ఓటీటీ డెబ్యూ ఇదే. అయితే ఈ పాత్రకు సంబంధించి సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు చాలా వివాదం కొనసాగింది. తమిళనాట సీజన్-2ను బ్యాన్ చేయాలంటూ ఆందోళన జరిగింది. వాటిపై స్పందించని సమంత.. రాజీ పాత్రపై మాత్రం స్పందించింది.
“రాజీ పాత్రను ఒప్పుకున్నప్పుడే అది సున్నితంగా, భావోద్వేగాలతో నిండి ఉండాలని నేను భావించాను. అంతేకాకుండా, అప్పటి పోరాటాన్ని, మనుషుల మధ్య ద్వేషాన్ని, అణచివేత, దురాశను గుర్తుచేసేలా ఆ పాత్ర ఉండాలని నేను కోరుకున్నాను. మేం అలా చేయలేకపోతే చాలామంది వ్యక్తుల, మహిళల గుర్తింపు, స్వేచ్ఛను మేం కాలరాసినవాళ్లం అవుతాం.
ఇలా రాజీ పాత్ర ఒప్పుకోవడం వెనక తన ఆలోచన విధానాన్ని బయటపెట్టింది సమంత. సీజన్-2లో తను పోషించిన రాజీ పాత్రలో చాలా స్ట్రగుల్ ఉందని.. తనకు నటించడానికి చాలా స్కోప్ ఉందని భావించిన తర్వాతే నటించడానికి ఓకే చెప్పానంటోంది సమంత.
“రాజీ పాత్ర కోసం చాలా హోం వర్క్ చేశాను. తమిళ ఈలం పోరాటాలకు సంబంధించి చాలా డాక్యుమెంటరీలు చూశాను. ఎన్నో కథనాలు చదివాను. మరీ ముఖ్యంగా అప్పటి మహిళల బాధల్ని అర్థం చేసుకున్నాను. యూనిట్ కు చెందిన క్రియేటివ్ టీమ్ నాకు ఇవన్నీ ఎప్పటికప్పుడు పంపించేవారు. తమిళ ఈలం కష్టాలు చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు. నా బాధను మాటల్లో చెప్పలేను.”
ది ఫ్యామిలీ మేన్ సీజన్-2లో తన పాత్రకు వచ్చిన గుర్తింపు చూసి సంతోషిస్తోంది సమంత. మంచి కథలు, పాత్రలు ఎంపిక చేసుకోవడానికి రాజీ పాత్ర తనకు మరింత స్ఫూర్తినిచ్చిందంటోంది.