పవన్ కోసం కొత్త న్యూస్ ఛానెల్.. జై కొట్టిన బండ్ల?

పవన్ కల్యాణ్ ఏం చెప్పినా, జనసేన ఏం చేసినా ప్రచారం కల్పించడానికి బోలెడన్ని సోషల్ మీడియా ఎకౌంట్స్ ఉన్నాయి. కానీ న్యూస్ ఛానెల్స్ మాత్రం లేవు. జగన్ ను విమర్శించినప్పుడు మాత్రమే చంద్రబాబు అను''కుల''…

పవన్ కల్యాణ్ ఏం చెప్పినా, జనసేన ఏం చేసినా ప్రచారం కల్పించడానికి బోలెడన్ని సోషల్ మీడియా ఎకౌంట్స్ ఉన్నాయి. కానీ న్యూస్ ఛానెల్స్ మాత్రం లేవు. జగన్ ను విమర్శించినప్పుడు మాత్రమే చంద్రబాబు అను''కుల'' మీడియా పవన్ ను భుజాన ఎక్కించుకుంటుంది. లేదంటే తీసి పక్కన పెట్టేస్తుంది.

ఈ విషయంపై జనసేన సోషల్ మీడియా వింగ్ లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. పవన్ కు ఓ మంచి న్యూస్ ఛానెల్ కావాలనేది అందరి అభిప్రాయం. ఈసారి కూడా అలాంటి చర్చే జరిగింది. అదే అభిప్రాయం బయటకొచ్చింది. అయితే కొత్తగా బండ్ల గణేశ్ యాడ్ అవ్వడం కొసమెరుపు.

“పవన్ కల్యాణ్ ను ఆదరించాలంటే ఒక న్యూస్ ఛానెల్ అవసరం, మీరు ఓ ఛానెల్ పెట్టండి. దానికి జనసైనికులం అండగా ఉంటాం” అంటూ ఓ పవన్ అభిమాని పెట్టిన పోస్టుకు బండ్ల గణేశ్ పరోక్షంగా సానుకూలంగా స్పందించారు. దానికి రీట్వీట్ కొట్టి తన ఆమోదాన్ని తెలిపారు.

నిజానికి 'పవన్ మీడియా' ఏర్పాట్లలో బండ్ల గణేశ్ పేరు చాలా ఏళ్ల కిందటే వినిపించింది. బండ్ల గణేష్ ఆధ్వర్యంలో, అతడి డబ్బుతో పవన్ కోసం ఓ న్యూస్ ఛానెల్ వస్తుందంటూ కొన్నేళ్ల కిందట గట్టి ప్రచారం కూడా సాగింది. కానీ ఆ ప్రచారం నిజమవ్వలేదు. అప్పట్లో పవన్-బండ్ల మధ్య కాస్త గ్యాప్ ఉండడం, బండ్ల మరో పార్టీతో జతకట్టడంతో ఛానెల్ ఏర్పాటు సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు పవన్-బండ్ల ఒక్కటయ్యారు. త్వరలోనే పవన్ తో బండ్ల గణేశ్ ఓ సినిమా కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ''న్యూస్ ఛానెల్'' అంశం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

టీడీపీతో ఉన్నన్ని రోజులు పవన్ కల్యాణ్ కు మీడియా అవసరం రాలేదు. ఎందుకంటే, టీడీపీ మీడియానే పవన్ మీడియాగా మారింది. తను చెప్పాలనుకున్న విషయాలన్నీ పవన్ తో చెప్పించి, తన ఎల్లో మీడియాతో చేయాల్సిన రచ్చంతా చేసేవారు చంద్రబాబు. అలా ఐదేళ్లు బాగానే గడిచింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.

గత ఎన్నికల నాటికి టీడీపీ-జనసేన ఎడమొహం-పెడమొహం అయ్యాయి. సోషల్ మీడియా ఛానెళ్లు తప్పితే, పవన్ కల్యాణ్ కు ప్రచారం చేసి పెట్టడానికి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానెళ్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అదే టైమ్ లో పవన్ కోసం కొలువైన 99టీవీతో పాటు మరో ఛానెల్, ఇంకో పత్రిక కాస్త ప్రచారం చేసినప్పటికీ అది పవన్ కు పనికిరాలేదు, కలిసిరాలేదు.

అలా ప్రస్తుతం తనకంటూ ఓ మీడియా లేకుండానే పార్టీని కొనసాగిస్తున్న పవన్.. 2024 ఎన్నికల నాటికైనా తనకంటూ ఓ న్యూస్ ఛానెల్ ఏర్పాటుచేసుకుంటే మంచిదని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు బండ్ల 'సేవల్ని' వాడుకోవాలనేది వాళ్ల డిమాండ్. బండ్ల కూడా ఓకే చెప్పేసినట్టే. పవన్ ఏమంటారో చూడాలి.