కరోనా వల్ల మంచి ఏదైనా జరిగిందంటే, అది సోనూసూద్ లాంటి గొప్ప వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేయడమే. కరోనా రాక ముందు సోనూసూద్ కేవలం ఓ సినీ నటుడు మాత్రమే. కానీ మహమ్మారి వల్ల సమాజంలో ఒక్కసారిగా అల్లకల్లోలం చెలరేగింది.
ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వారెందరో. అలాగే వైద్యానికి నోచుకోక చావును ఆశ్రయించిన వాళ్ల సంగతి సరేసరి. ఇలాంటి ఎందరో అభాగ్యులను కులం,మతం, ప్రాంతం చూడకుండా ఆదుకున్న ఆపద్బాంధవుడిగా సోనూసూద్‌ను సమాజం గుర్తించి, గౌరవిస్తోంది.
ఇలాంటి వ్యక్తి మనకు పాలకుడైతే ఎంత బాగుంటుందో కదా అనే బలమైన అభిప్రాయాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవిపై సోనూసూద్ మనసులో మాటేంటో తెలుసుకుందాం.
సోనూసూద్ సేవా కార్యక్రమాలపై బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి సోనూ సూద్ లాంటి వ్యక్తి పీఎంగా కావాలని ఆమె ఆకాంక్షించారు. సోనూసూద్ పీఎం రేసులో ఉంటే తన ఓటు ఆయనకే అంటూ ఆమె స్పష్టం చేశారు.
హుమా ఖురేషి వ్యాఖ్యలపై .సోనూసూద్ స్పందించారు. తన గురించి అలా మాట్లాడ్డం ఆమె మంచితనమని వినమ్రంగా చెప్పారు. హుమా ఖురేషి వ్యాఖ్యలను తాను గౌరవంగా భావిస్తానని తెలిపారు. అయితే అత్యున్నత పదవికి తాను అర్హుడిని కాదని సోనూసూద్ చెప్పడం గమనార్హం.
వయసు, అనుభవంలో తాను చిన్నవాడినంటూ వినమ్రత చాటారు. అలాగే తానిప్పుడు చేస్తు న్నవన్నీ ఏదో ఆశించి చేయడం లేదని స్పష్టం చేశారు. తన సంతృప్తి కోసమే చేస్తున్నట్టు సోనూసూద్ తెలిపారు. ఇప్పటికైతే రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.