అనేక వాదవివాదాల మధ్య ఆనందయ్య మందు పంపిణీకి నోచుకుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆదివారం మందు పంపిణీ ప్రక్రియను ఆనందయ్య సోదరుడు, ఇతర టీం సభ్యులు ప్రారంభించారు.
గత నెల 21న ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీని నిలిపేసింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల అధ్యయనం అనంతరం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నంలో క్యూలో నిలిచి ఉన్న వారికి మందు అందజేస్తున్నారు.
ముందుగా ప్రకటించినట్టుగా మొట్ట మొదట సర్వేపల్లి నియోజకవర్గ వాసులకు మందు పంపిణీ చేస్తున్నారు. ఈ మందు కోసం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కృష్ణపట్నం తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎలాంటి ఇబ్బంది లేకుండా మందు పంపిణీని పకడ్బందీగా చేపట్టినట్టు ఆనందయ్య తెలిపారు.
తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇంటింటికీ ఔషధం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల వారికి తర్వాత ఇస్తామన్నారు. ఎక్కడెక్కడి నుంచో కృష్ణపట్నానికి వచ్చి ఇబ్బందులు పడొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.