కేసీఆర్ పై షర్మిల మరో ‘బాణం’

తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించిన మరుసటి రోజు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు వైఎస్ షర్మిల. తెలంగాణ అమరవీరుల త్యాగాల నుంచి నిరుద్యోగం వరకు చాలా అంశాల్ని టచ్ చేస్తూ…

తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించిన మరుసటి రోజు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు వైఎస్ షర్మిల. తెలంగాణ అమరవీరుల త్యాగాల నుంచి నిరుద్యోగం వరకు చాలా అంశాల్ని టచ్ చేస్తూ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై స్పందిస్తూ, ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

“ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?”

ఇలా తెలంగాణలో జరుగుతున్న వ్యాక్సినేషన్ విధానంపై విమర్శలు చేశారు షర్మిల. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఫస్ట్ డోస్ ఇవ్వక నెల రోజులు దాటిందని, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో మాత్రం అన్నిరకాల కరోనా వ్యాక్సిన్లు దొరుకుతున్నాయని ఆరోపించారు షర్మిల. ఇప్పటికైనా సర్కారు తన తీరు మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఓవైపు ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూనే, మరోవైపు తన కొత్త పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించే అంశంపై షర్మిల దృష్టిపెట్టారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసిన షర్మిల.. తాజాగా తన పార్టీకి అధికార ప్రతినిధుల్ని సైతం ప్రకటించారు.