తెలుగుదేశం అదినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అధికారం పోయిందన్న బాధ, దుగ్ద ఇంకా పోయినట్లు లేదు. ఆయన మళ్లీ ఇప్పుడు తన ఓటమికి ప్రజలను తప్పు పడుతున్నారు. ప్రజలు తనను అర్దం చేసుకోలేకపోయారని అంటున్నారు.మంచిని అర్థం చేసుకోలేని ప్రజానీకం ఉంటే ఏం చేయగలుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష కోట్ల అవినీతి చేసిన వ్యక్తిని సరిగా విశ్లేషించలేని ప్రజానీకం ఉన్నప్పుడు తమకు బాధలు తప్పవన్నారు.
తమ వాళ్లు అందరూ బాధపడుతున్నారని, తనను మారాలంటున్నారని, కానీ దానికి ముందు నిలబడి ఉండాలి కదా అని ఆయన అన్నారట.అదే సమయంలో 2024 ఎన్నికల్లో టీడీపీ నూటికి నూరు శాతం గెలుస్తుందని, ఇందులో అనుమానం అవసరం లేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారం అన్నది ఒక కైపు వంటిది. ఒకసారి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని చక్రం తిప్పిన తర్వాత, అది కూడా తనకు ఎదురులేని రీతిలో తన ఇష్టారాజ్యంగా పాలన సాగించిన తర్వాత ఇలా ఓడిపోతే ఎంత బాధగా ఉంటుంది.
ఇందులో ప్రజలను తప్పు పడుతుండడం అంటే ఆయన ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. అంతెందుకు మహానాడులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంత సవివరంగా ఏ ఏ వర్గాల వారు పార్టీకి దూరం అయింది విడమరిచి చెప్పారు.రెడ్లు, ఎస్.సి, ఎస్టి, ముస్లిం వర్గాలు పార్టీకి బాగా దూరం అయ్యాయన్న సంగతి బహిరంగ రహస్యమే. అదే సమయంలో బిసి వర్గాలు కూడా ప్రజలంగా వైసిపి వైపు వచ్చేశారు.
చంద్రబాబు ఇప్పటికీ ద్వేషపూరితంగా ముఖ్యమంత్రి జగన్ పై లక్ష కోట్ల ఆరోపణను కొనసాగించడం ద్వారా ఆత్మ సంతృప్తి చెందుతున్నారనుకోవాలి. నిజానికి అప్పట్లో కాంగ్రెస్ తో కలిసి ఆయన ఈ కేసులు పెట్టించిన సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో మాజీ మంత్రి మైసూరారెడ్డితో జగన్ పై వచ్చిన ఆరోపణల విలువను లెక్కింప చేశారట.
సిబిఐ పెట్టిన కేసులలో వాస్తవం ఉందా ? లేదా అన్నది పక్కనబెడితే, అన్ని కేసులు కలిసినా నాలుగైదువేల కోట్లు కావని ఆయన చంద్రబాబు కు చెప్పారట. అయితే అప్పటికప్పుడు చంద్రబాబు లక్ష కోట్లు అని తయారు చేయండి అని చెప్పారట. ఆ మేరకు ప్రచారం కూడా సాగించారు.ఇప్పుడు తాను లక్ష కోట్ల ఆరోపణ చేసినా ప్రజలు ఎందుకు నమ్మలేదో అని ఆలోచించుకుంటున్నట్లుగా ఉంది.
జగన్ పై రాజకీయంగా పెట్టిన కేసులని మెజార్టీ ప్రజలు భావించారు. నిజానికి జగన్ కాస్త జాగ్రత్తగా ఉంటే 2014లోనే అదికారంలోకి వచ్చేవారు. కాని ఆయన కొంత అధిక విశ్వాసం అనండి, ఇతర కారణాలు అనండి అధికారాన్ని సాదించలేకపోయినా, నువ్వా,నేనా అన్నట్లు పోటీ ఇచ్చారు. అందువల్లే ఆ ఎన్నికలలో టిడిపి, వైసిపిల మధ్య కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడానే వచ్చింది. మరి అదే 2019లో జగన్ కు ఏభై శాతం ఓట్లు వస్తే చంద్రబాబుకు నలభై శాతం ఓట్లు వచ్చాయి. అంటే పదిశాతం ఎక్కువ ఓట్లను జగన్ పొందగలిగారు.
ఇంత పెద్ద తీర్పు ఇచ్చిన ప్రజలను తప్పు పట్టడం అంటే చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని అర్ధం. పార్టీ నేతలు ఆయనను మారాలని చెబుతుంటారు.కాని దానికి ముందు నిలబడి ఉండాలి కదా అని చంద్రబాబు ఎన్ ఆర్ ఐ లతో జూమ్ సమావేశంలో అన్నారట. ఇది మాత్రం వాస్తవం. పార్టీ నిలబడుతుందా ? లేదా అన్న భయం ఆయనను ఆవహించిందని అనుకోవాలి. మళ్లీ వెంటనే 2024 ఎన్నికలలో మనమే గెలుస్తామని చెప్పడం ద్వారా టిడిపి క్యాడరులో కొంతైనా విశ్వాసం నింపాలన్నది ఆయన యత్నంగా కనబడుతుంది.
పంచాయతీ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో సైతం 75 పంచాయతీలను వైసిపి ఎలా గెలుచుకుంది ? మరి ఇంతకాలం తనను ఎన్నుకున్న కుప్పం ప్రజలు ఇప్పుడు తప్పు చేశారని ఆయన చెబుతారా ? అలాగే మున్సిపల్ ఎన్నికలలో ఒక్క తాడిపత్రి తప్ప మిగిలినవన్నీ వైసిపినే ఎలా గెలుచుకోగలిగింది. గత సారి మున్సిపాల్టీ ఎన్నికలలో టిడిపి కి ఓటు వేసిన ప్రజలను ఆయన ఇప్పుడు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు కాని, ప్రజలు తనను ఎందుకు దూరంగా పెట్టారన్నదానిపై ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు.
చంద్రబాబు పాలనలో అసలు ఏమీ అరాచకాలు జరగనట్లు, అవినీతి అసలే లేదన్నట్లు, అమరావతి రాజదాని నిర్మాణం పూర్తి చేసేసినట్లు ఆయన భ్రమపడి ప్రజలను కూడా భ్రమపడమంటున్నారు. ప్రజల విజ్ఞతను ఆయన తక్కువ అంచనావేశారు. టిడిపి నేతలు పలువురు అప్పట్లో రకరకాల మాఫియాగా మారితే వారికి చంద్రబాబు అండగా నిలిచారా?లేదా? జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే తన పార్టీవారు చెప్పే పనులు చేయాలని మోహమాటం లేకుండా చెప్పారా ? లేదా ? అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాల భూములు టిడిపి నేతలు ఎలా కొనుగోలు చేశారు.
అందులోను ఒక వర్గం వారే ఎలా కొన్నారు ? సింగపూర్ కంపెనీకి 1600 ఎకరాల భూమి ఇవ్వడమే కాకుండా, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి 5500 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎలా అంగీకరించారు ? అమరావతికి ఎన్ని లక్షల కోట్లు కావాలో ఆయనే చెబుతుండేవారు కదా? కేంద్రానికి లక్షతొమ్మిది వేల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ప్రతిపాదిస్తే డిల్లీ పెద్దలు నవ్వుకుని వదలివేశారా ? లేదా ? అంత మొత్తం రాష్ట్ర ప్రజల నెత్తిన భారంగా పెట్టి, రాజధాని నిర్మాణం చేయడం ద్వారా తన వర్గంవారి రియల్ ఎస్ట్టేట్ పెంచడానికి ఆయన కృషి చేశారా?లేదా ?
రాజధాని ప్రకటించగానే అక్కడ ఎకరా కోట్ల రూపాయల ధర పలికిందని ఆయనకాని, టిడిపి నేతలు కాని ప్రచారం చేస్తుండేవారు. అంటే రాజధానిలో సామాన్యుడికి అవకాశం లేదని వారు చెప్పకనే చెప్పారు. పైగా మిగిలిన జిల్లాల ప్రజల సొమ్ము తీసుకు వచ్చి ఒక్క అమరావతిలో ఖర్చు చేస్తే మిగిలినవాళ్లు ఏమవ్వాలి? ఇలాంటి ఆలోచనలు ఆయనకు వచ్చి ఉండకపోవచ్చు. కాని ప్రజలు దీనిపై గట్టి ఆలోచనే చేశారు. అందువల్లే ఆయనను ఓడించారు.
అయినా రెండు లక్షల కోట్ల సంపద పోయిందని ఆయన చెబుతున్నారు. అంటే ఆ మేరకు ఆయన మనుషులు కాని, దళారులు కాని సంపాదించుకుని ఉండేవారన్నమాటే కదా ? ఇక ఆయా సామాజికవర్గాలవారి పట్ల చంద్రబాబు ఎలా వ్యవహరించింది తెలియదా? సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను, తమకు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలని అడగడానికి వచ్చిన మత్సకారులను ఎలా అవమానించింది ఆయన మర్చిపోయి ఉండవచ్చు.
బాద పడ్డ ప్రజలు మర్చిపోతారా ? ఎస్సిలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని ప్రశ్నించి ఆ వర్గాన్ని ఎంతగా ఆత్మనూన్యతకు గురి చేసింది ఆయనకు గుర్తు లేదా ? ఇరవై మూడు మంది వైసిపి ఎమ్మెల్యేలను తాను స్వయంగా కొనుగోలు చేసింది గొప్ప విషయం అని ప్రజలు అనుకోవాలని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది. తన కుమారుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించకుండా, ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తే ,అందులో ఉన్న మంచి, చెడును ప్రజలు అర్ధం చేసుకోలేరని చంద్రబాబు అనుకున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
ప్రజలు బాగా అర్దం చేసుకునే చంద్రబాబు పార్టీని ఘోరంగా ఓడించారు. తాము పాలనలో ఏ తప్పులు చేశామన్నదానిపై పరిశీలన చేసుకోకుండా ఇలా ప్రజలను తప్పు పడితే ప్రయోజనం ఉండదు సరికదా, ఎప్పటికి ప్రజలు ఆయనను దూరంగా ఉంచుతారు.మరో వైపు ముఖ్యమంత్రి జగన్ తొంభై శాతం హామీలను నెరవేర్చితే అదంతా మోసం అని చంద్రబాబు, ఆయన అనుయాయులు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అవి వాస్తవమా ? కాదా అన్నది లబ్దిదారులకు తెలియకుండా పోతుందా?టిడిపి నేతలు భూములు ఆక్రమించుకున్నా వాటి జోలికి వెళ్లకూడదని టిడిపి వారు చెబుతున్నారనుకోవాలి.
జెసిబి పాలన చేస్తారా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారంటే ఆక్రమాలకు వారే స్వయంగా మద్దతు ఇవ్వడాన్ని ప్రజలు గమనించకుండా ఉంటారా ? అవినీతి కుంభకోణాలలో కొందరు టిడిపి నేతలు అరెస్టు అయితే అదేదో కక్ష అని ప్రచారం చేయడం రాజకీయంగా కరెక్టో కాదో వారే ఆలోచించుకోవాలి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఒక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
ఆ క్రమంలోనే చంద్రబాబు ప్రజలపై తన ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నారని అనుకోవచ్చా?ఏతావాతా చెప్పేదేమిటంటే చంద్రబాబును ప్రజలు బాగానే అర్దం చేసుకున్నారు. అందుకే ప్రతిపక్షానికి పరిమితం చేశారు.
కొమ్మినేని శ్రీనివాసరావు