ఫ్యామిలీ మేన్ సీజన్-2లో ఉగ్రవాది పాత్రలో కనిపించింది సమంత. మరీ ముఖ్యంగా సౌత్ నుంచి బయటకొచ్చి సమంత చేసిన మొట్టమొదటి ప్రాజెక్టు ఇది. ఇన్నాళ్లూ ఆమె సౌత్ లో మాత్రమే నటించింది. ఇదే విషయంపై స్పందించిన సమంత.. తనకు అలాంటి తేడా కనిపించలేదంటోంది.
“రాజ్, డీకేతో వర్కింగ్ నాకు కాస్త కొత్తగా అనిపించింది తప్ప, టాలీవుడ్ నుంచి బయటకొచ్చి చేస్తున్నట్టు అనిపించలేదు. ఇద్దరు మేకర్స్ తో ఒకే ప్రాజెక్టు చేయడం కాస్త ఇబ్బంది అనిపించింది. అందుకే షాట్ చేసిన ప్రతిసారి ఇద్దర్లో ఎవరో ఒకరిపై ఆధారపడేదాన్ని.
ఒక సీన్ ను ఇద్దరూ చర్చించుకునే విధానం నాకు బాగా నచ్చింది. మొత్తం వాళ్లే డిస్కస్ చేసుకోవడంతో నేను కలుగజేసుకునే అవసరం రాలేదు. వాళ్ల డిస్కషన్లు చూశాక ఇక నేను ప్రశ్నలు అడక్కూడదని, వాళ్లు చెప్పింది చేసుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నాను.”
ఈరోజు రిలీజైన ఫ్యామిలీమేన్ ట్రయిలర్ లో ఉగ్రవాది రాజీ పాత్రలో కనిపించింది సమంత. అయితే తన పాత్ర కేవలం టెర్రరిస్ట్ రోల్ వరకు మాత్రమే పరిమితం కాదని, చాలా లేయర్స్ ఉన్నాయని అంటోంది.
“రాజి పాత్రను కేవలం నేను ఉగ్రవాది పాత్రగానో, యాక్షన్ క్యారెక్టర్ గానో చూడడం లేదు. అంతకుమించి నా పాత్ర ఉంటుంది. దర్శకులు నా పాత్రకు ఎన్నో లేయర్స్ జోడించారు. సీజన్-2 చూసిన తర్వాత నా పాత్ర ఏంటనేది పూర్తిగా అర్థమౌతుంది.”
రాజి పాత్ర చేయడానికి శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానంటోంది సమంత. ఫిజికల్ గా చాలా కష్టపడాల్సి వచ్చిందని, కానీ అంతా ఇష్టంతో చేశానంటోంది. ఇక రాజీ పాత్రకు సంబంధించి ముఖంపై కత్తి గాటు ఉంటుంది. పోస్టర్లలో దాన్నే హైలెట్ చేశారు. దానిపై స్పందించడానికి మాత్రం సమంత నిరాకరించింది. సీజన్-2 చూసి తెలుసుకోవాలని ఊరిస్తోంది.