సమంత లాంటి స్టార్ ఓ షో హ్యాండిల్ చేస్తే ఎలా ఉండాలి? ఆ కార్యక్రమాన్ని ఎంత ప్రత్యేకంగా డిజైన్ చేయాలి? కంటెంట్ పరంగా, క్వాలిటీ పరంగా ఏ రేంజ్ లో ఉండాలి? ''ఆహా'' జనాలు మాత్రం ఇవేవీ ఆలోచించినట్టు లేరు. సమంత ఉంటే చాలు షో నడిచిపోద్ది అనే ధీమాతో కార్యక్రమాన్ని లాంఛ్ చేసినట్టున్నారు.
''ఆహా'' యాప్ లో శామ్-జామ్ అనే కొత్త షో లాంఛ్ అయింది. సమంత దానికి యాంకర్. ఆమె ఉందంటే కచ్చితంగా ఏదో కొత్తగా ఉంటుందని అంతా ఊహించారు. కానీ అలాంటిదేం కనిపించలేదు. ఓ రొటీన్ ఇంటర్వ్యూ, ఛాట్ షోను తలపించింది శామ్ జామ్.
ఇంకా చెప్పాలంటే.. ఓ ఛానెల్ లో వచ్చే బతుకు జట్కాబండి కార్యక్రమాన్ని, మరో ఛానెల్ లో వచ్చే 'అలీతో సరదాగా' అనే షోను మిక్స్ చేసి ఈ కొత్త ప్రొగ్రామ్ తయారుచేసినట్టున్నారు. మధ్యలో సుమక్క చేసే క్యాష్ అనే ప్రొగ్రామ్ ఛాయలు కూడా కనిపించాయి.
ఫస్ట్ ఎపిసోడ్ లో భాగంగా ఓ స్టార్ ను కూర్చోబెట్టారు. అతడితో మాటామంతీ స్టార్ట్ చేసింది సమంత. అదేదో అలా నడుస్తుందనుకునేలోపు ఓ మానసిక నిపుణుడ్ని, వైద్యుడ్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. అది కూడా చాలదనుకున్నారేమో.. ఓ పేద కుటుంబాన్ని వేదికపైకి తీసుకొచ్చి వాళ్లతో మాట్లాడించారు.
ఇలా అటు బతుకు జట్కాబండికి కొనసాగింపుగా.. ఇటు సెలబ్రిటీ షోకు కాస్త తక్కువగా నడిచింది శామ్ జామ్ కార్యక్రమం. ఇది చాలదన్నట్టు మధ్యలో వైవా హర్షను రంగంలోకి దించారు. సూట్ వేసుకున్న హర్ష ఎందుకొచ్చాడో, ఎందుకు వెళ్లాడో కూడా ఎవ్వరికీ అర్థంకాలేదు.
కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాకుండా.. ఎవేర్ నెస్, సందేశం, ఎమోషన్ ఇలా అన్నీ మిక్స్ చేసేయాలనే అత్యుత్సాహంతో శామ్ జామ్ కాస్తా, శామ్ కిచిడి అయిపోయింది.