పూరీ మ్యూజింగ్స్ పేరుతో ప్రముఖ దర్శకుడు వివిధ అంశాలపై తనదైన ప్రత్యేక కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇది బాగా ఆకట్టు కుంటున్నాయి. తాజాగా ఆయన బ్రిటీష్ గురించి అద్భుత విశ్లేషణ చేశారు. శత్రువుల నుంచైనా మంచిని గ్రహించాలని పూరీ చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. అలాగే ఎవరికీ తెలియని సంగతిని పూరీ చెప్పుకొచ్చారు.
“అతి తక్కువ జనభా ఉన్న చిన్న దేశం నుంచి బ్రిటీష్ వాళ్లు వచ్చి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని సృష్టించారు. 22 దేశాలను తప్ప ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాలను పాలించారు.
ప్రపంచంలో అందరికీ షర్టు, ఫ్యాంటూ వేయడం నేర్పారు. ఇంగ్లీష్ నేర్పారు. ఆక్రమించిన దేశాలన్నింటినీ సొంత దేశాల్లా భావించి అభివృద్ధి చేశారు. ఒక్కో దేశానికి వరుసగా స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ పోయారు.
అయితే ఒక్క దేశ ప్రజలు మాత్రం..`మాకు స్వాతంత్ర్యం వద్దు. మమ్మల్ని పాలించండి. లేదంటే మా దేశంలో అభివృద్ధి ఆగిపోతుంది అని అడిగారు. దాంతో ఆ ఒక్కదేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకుని అభివృద్ధి చేసి 1997లో స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లిపోయారు. ఆ దేశం హాంకాంగ్” అంటూ పూరీ కొత్త విషయాన్ని తెలిపారు.
బ్రిటీష్ వారి పాలనలో ఉండడం వల్లే హాంకాంగ్ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఆంగ్లేయుల నుంచి మనం అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలని సూచించారు. మనం పది ఊళ్లలో పది ఆఫీసులు పెట్టినా సరిగ్గా పని చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది, వందల దేశాలను బ్రిటీష్ వాళ్లు పాలించారంటే మాటలు కాదని, ఎంత క్రమశిక్షణగా పనిచేశారో అర్థం చేసుకోవాలని కోరారు.
చివరిగా ఆయన ఏమన్నారంటే… మంచి అనేది మన శత్రువులో ఉన్నా నేర్చుకోవాలని హితవు పలికారు. అందువల్లే బ్రిటీషర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని చెబుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.