దుబ్బాక విజయోత్సాహంతో గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ. అయితే ఇక్కడ వ్యూహాన్ని పూర్తిగా మార్చివేసింది. దుబ్బాకలో బీజేపీ టార్గెట్ టీఆర్ఎస్ మాత్రమే, కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల విషయానికొస్తే.. ఇక్కడ టీఆర్ఎస్ తోపాటు, ఎంఐఎంతో కూడా బీజేపీ కలబడాలి, నిలబడాలి.
అయితే టీఆర్ఎస్, ఎంఐఎం.. మధ్య అవగాహన ఉన్న మాట వాస్తవం. పోటీ ఉన్నా అది కేవలం ప్రత్యర్థి ఓట్లను చీల్చడం కోసం మాత్రమే. అందుకే బీజేపీ అభివృద్ధి అనే అంశాన్ని పక్కనపెట్టింది, కేవలం మతం అనే ప్రధాన అస్త్రాన్ని మాత్రమే ప్రయోగించాలనుకుంటోంది.
గ్రేటర్ లో టీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు వచ్చినా ఎంఐఎం అభ్యర్థికి మేయర్ పదవి ఇస్తారనే ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. ఎంఐఎం చేతిలోకి అధికారం వస్తే హిందువుల జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతాయని, మత కల్లోలాలు పెరిగే అవకాశముందని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగుతోంది.
63 డివిజన్ల పరిధిలో హిందువుల ఓట్లు తగ్గించి, ముస్లింల ఓట్లు పెంచారని రచ్చ చేయడం మొదలు పెట్టింది బీజేపీ. దీనికి సంబంధించి ఈ పాటికే ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేసిన కమలదళం.. హిందువుల ఓట్లను గుంపగుత్తగా సంపాదించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
హైదరాబాద్ వరదలు, కార్పొరేటర్ల అవినీతి.. లాంటి స్థానిక సమస్యలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషిస్తాయని అందరూ అనుకున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ అంశాలతో పాటు మతం ప్రాతిపదికన ఓట్లు అడిగేందుకు సిద్ధమైంది. చంద్రబాబు బహిరంగ మద్దతిస్తే బీజేపీకి మరింత ప్రమాదం అందుకే టీడీపీతో లోపాయికారీ ఒప్పందం ఉంటుందని తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్, వామపక్షాలను జనం పట్టించుకోవడం మానేశారని బీజేపీ అంచనా. గ్రేటర్ ఎన్నికల లోగా.. విజయశాంతి లాంటి స్టార్ క్యాంపెయినర్ ని తమవైపు తిప్పుకోగలిగితే.. మరింత లాభం ఉంటుందని ఆ పార్టీ పథకాలు రచిస్తోంది.
అటు తీగల కృష్ణారెడ్డి లాంటి నాయకులకు కూడా గాలం వేసి పెట్టింది. ఎలాగూ పాత కార్పొరేటర్లలో చాలామందికి టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, అసంతృప్తులందర్నీ తమవైపు తిప్పుకోవడం మరో ఆలోచన.
ఈ వ్యూహాలన్నిటితో గ్రేటర్ పై పట్టు పెంచుకునేందుకు ఇప్పటినుంచే సిద్దమవుతోంది బీజేపీ. దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేస్తామంటూ ధీమాగా ఉంది.