ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో ఏడాది కిందట విడుదలవ్వాల్సిన సినిమా లవ్ స్టోరీ. నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు విడుదల తేదీలు మారిపోతూనే ఉన్నాయి.
తాజాగా దీపావళి పండగను పురస్కరించుకొని రిలీజ్ డేట్ చెబుతారని అంతా ఆశించారు. అయితే దీపావళి పోస్టర్ వచ్చింది కానీ అందులో విడుదల తేదీ లేదు.
ఈమధ్య కాలంలో ఈ సినిమాకు జరిగినంత రీషూట్ కార్యక్రమం మరే సినిమాకు జరగలేదు. సో.. షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చింది. లవ్ స్టోరీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ విడుదలపై మాత్రం మేకర్స్ నోరు మెదపడం లేదు.
అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిన డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ వచ్చే నెల ఈ సినిమా విడుదల కాదని తేలిపోయింది. సరైన సమయం చూసుకొని మూవీని విడుదల చేస్తామని మాత్రమే యూనిట్ నుంచి ప్రకటన వచ్చింది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ రిలీజ్ వ్యవహారాలు పక్కనపెడితే.. దీపావళి సందర్భంగా ఈరోజు విడుదలైన పెళ్లి పోస్టర్ మాత్రం బాగుంది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్ లో చైతూ-సాయిపల్లవి జంట చూడముచ్చటగా ఉంది. స్టార్ మా ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది.