కొన్ని రంగాల్లో కొన్ని క్యారెక్టర్లు సమాజంపై చెరగని ముద్ర వేస్తాయి. సినిమా రంగానికి వస్తే బ్రహ్మానందం తన హాస్య నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసుకున్నారు. అందుకే కళాకారులెవరైనా చిరంజీవులని అంటారు.
రాజకీయాల్లో కూడా మనకు ఇటీవల బ్రహ్మానందాన్ని గుర్తు చేస్తున్న క్యారెక్టర్లు కనిపిస్తున్నారు. అయితే బ్రహ్మానందం వెండితెరపై కనిపించి నవ్విస్తే …రాజకీయ తెరపై మాత్రం ఈ బ్రహ్మానందం క్యారెక్టర్లు నవ్వుల పాలవుతున్నారు. అదే రెండింటి మధ్య తేడా అదే. ఇక రాజకీయ బ్రహ్మానందం ఎవరా అంటే…. ఇంకెవరు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి పేరే వినిపిస్తోంది.
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ విశాఖను దోపిడీ చేస్తూ అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, విశాఖకు వైసీపీ చేసేందేముంది అని ఆయన నిలదీశారు.
ఉన్న పెట్టుబడులు తరిమేయడం తప్ప గొప్పగా విశాఖకు వైసీపీ చేసిందేమీ లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో విశాఖలో విధ్వంసం ప్రారంభమైందని అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే విశాఖను పరిపాలనా రాజధానిగా చేసింది. ఇంతకంటే ఉత్తరాంధ్ర వాసులు కోరుకున్నదేంటి? జగన్ ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తే …. దాన్ని టీడీపీ అడ్డుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే గీతం యూనివర్సిటీ యథేచ్ఛగా విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టడాలు నిర్మించింది.
దీనికి అడ్డుకట్ట వేయకపోగా ఆక్రమించిన స్థలాలను రెగ్యులరైజ్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? గీతం అక్రమ కట్టడాలను కూల్చి ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం అయ్యన్న పాత్రుడి దృష్టిలో వైసీపీ విధ్వంస పాలనకు నిదర్శనమైతే … దాన్ని అట్లే పిలుచుకుందాం.
చంద్రబాబు హయాంలో అభివృద్ధి ఫలానా అని చెప్పుకోలేని దుస్థితిలో అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ప్రభుత్వంపై ఏదో ఒకటి విమర్శలు చేయాలనే అత్యుత్సాహంలో ….మాజీ మంత్రి అపహాస్యపాలవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.