ఇండియన్ టాప్ డైరక్టర్లో ఒకరు శంకర్. తొలిసారి తెలుగు సినిమా చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ తో. ఇప్పుడు ఆయనతో మరో సినిమా తెలుగులోనే నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రామ్ చరణ్ సినిమా తరువాత శంకర్ ఇండియన్ 2 సినిమా చేయాల్సి వుంది. విక్రమ్ సినిమా హిట్ కావడంతో మళ్లీ కమల్ హాసన్ కు క్రేజ్ కనిపిస్తోంది. అందుకే ఇండియన్ 2 ప్రాజెక్టు ముందుకు వస్తోంది. తమిళంలో ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ చేసేందుకు ఉదయానిధి స్టాలిన్ ముందుకు వచ్చినట్లు బోగట్టా.
అయితే దాని తరువాత సినిమా మళ్లీ తెలుగులో చేయించాలని నిర్మాత దిల్ రాజు చూస్తున్నారు. ఎన్టీఆర్ కాంబినేషన్ లో శంకర్ తో సినిమా చేయించాలన్నది ఆయన కోరిక అని తెలుస్తోంది.
ఇదిలా వుంటే వారియర్ నిర్మించిన చిట్టూరి శ్రీను కూడా శంకర్ డేట్ ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే లింగుస్వామితో ఓ సినిమా చేసారు. మరో సినిమా కూడా చేయబోతున్నారు.
అదే లింగుస్వామికి శంకర్ తో చాలా అంటే చాలా సన్నిహిత సంబంధం వుంది. ఆ స్నేహంతో శంకర్ ఈసారి తెలుగు సినిమా చిట్టూరి శ్రీనుకు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వారియర్ క్లిక్ అయితే లింగుస్వామికి పెద్ద హీరోల డేట్ లు దొరుకుతాయి. అలాగే శంకర్ డేట్ లు చేతిలో వుంటే పాన్ ఇండియా కు ప్లాన్ లు వేసుకోవచ్చు.