నిన్నంతా ఇదే హాట్ టాపిక్. ఓ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో కృష్ణ పాల్గొన్నారు. ఆయనకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. ఆ ఫొటోలు చూసిన కృష్ణ అభిమానులు షాక్ అయ్యారు. సూపర్ స్టార్ మొహం నిండా తెల్లటి మచ్చలు, ఏవేవో ప్యాచెస్ కనిపించాయి. దీంతో నిన్నంతా సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్ పాయింట్ గా మారింది.
కృష్ణకు వయసుమళ్లిన మాట వాస్తవమే. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఎప్పుడూ ఫొటోల్లో నవ్వుతూ కనిపిస్తారు. కానీ నిన్న రిలీజైన స్టిల్స్ లో మాత్రం ఆయన ముఖం పూర్తిగా పాలిపోయి, తెల్లటి మచ్చలతో కనిపించింది. దీంతో అంతా ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
నిజానికి కృష్ణ ముఖానికి ఏం కాలేదు. ఆయన బాగానే ఉన్నారు. ఆయన ధరించిన మాస్క్ వల్ల ఫొటోలు అలా వచ్చాయంతే. ఈ విషయాన్ని కృష్ణ సన్నిహితులు బయటపెట్టేవరకు ఎవ్వరూ గుర్తించలేకపోయారు.
కరోనా టైమ్ లో కృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పూర్తిగా తగ్గినప్పటికీ ఆయన మాత్రం బయటకొచ్చేటప్పుడు విధిగా మాస్కు ధరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్విజబుల్ మాస్క్ ధరించారు కృష్ణ. అంటే దూరం నుంచి చూస్తే మాస్క్ లేనట్టే ఉంటుంది. కానీ దగ్గరగా చూస్తే ముక్కు, నోరు కవర్ అయ్యేలా ఓ మాస్క్ ఉన్నట్టు అర్థమౌతుంది.
ఫొటోలు తీసినప్పుడు ఆ మాస్క్, కృష్ణ ముఖంలో కలిసిపోవడం వల్ల ఆ స్టిల్స్ చూసి అంతా గందరగోళానికి గురయ్యారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కృష్ణ తన ఇల్లు దాటి బయటకు రావడం లేదు. చాలా కొద్దిమందిని మాత్రమే ఆయన కలుస్తున్నారు.