నిన్న సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు నటి షబానా అజ్మీ. వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు మరింత మెరుగైన చికిత్స కోసం ముంబయిలోకి కోకిలాబెన్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ప్రకటించిన వైద్యులు, గాయాలు మాత్రం తీవ్రంగా ఉన్నాయంటున్నారు.
నిన్న సాయంత్రం ముంబయి-పూణె హైవేపై షబానా అజ్మీ కారు యాక్సిడెంట్ కు గురైంది. ఓ ట్రక్ ఆమె కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన నుంచి షబానా అజ్మీ భర్త జావెద్ అక్తర్ తృటిలో తప్పించుకోగా.. షబానాకు, కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
తన భర్త జావెద్ అక్తర్ 75వ పుట్టినరోజు వేడుకను షబానా అజ్మీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇది జరిగి కొన్ని గంటలైనా అవ్వకముందే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.
బాలీవుడ్ లో ఆర్ట్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు షబానా. ఉత్తమ నటిగా 5సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. షబానా అజ్మీ స్వస్థలం హైదరాబాద్. ప్రముఖ నటి టబుకు ఈమె స్వయంగా మేనత్త.