ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణలో అమాయకత్వం, అజ్ఞానం, బోలాతనం, చిలిపితనం, ఈర్ష్య, చంద్రబాబు పిచ్చి, జగన్ ద్వేషి …ఇలా అనేక వ్యక్తిత్వాలు ఆయనలో దాగి ఉన్నాయి. ఒక్కో వారం ఒక్కొక్కరు పూనకంలోకి వచ్చి ఆయనతో రాయిస్తుంటారు.
ఆర్‌కే మంచివాడే. కానీ ఆయనలో పరకాయ ప్రవేశం చేసిన ఆ శక్తులదే తప్పంతా. కులం మాత్రం ఆయన్ను 24 గంటలూ నీడలా వెంటాడుతూనే ఉంటుంది. కుల ప్రస్తావన లేని ‘కొత్త పలుకు’ ఉండదంటే అతిశయోక్తి కాదు.
ఈ వారం ‘అమరావతి సాక్షిగా…అయోమయాంధ్ర’ అని ఆయన రాశారు. ఆంధ్రప్రదేశ్ అయోమయం సంగతేమో కానీ, ఆర్‌కే మాత్రం ఎంత అయోమయంలో ఉన్నాడో ఈ కథనం చదివితే అర్థమవుతుంది.
‘నిజానికి తెలుగుదేశం లేకుండా బీజేపీ–జనసేన మాత్రమే కలిసి పనిచేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం వల్ల అధికార పార్టీనే లాభపడుతుంది. ఈ సంగతి తెలుసు కాబట్టే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని బీజేపీ–జనసేన కలుపుకోకూడదన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు విమర్శలు మొదలెట్టారు. తమతో కలవకుండా బీజేపీ–జనసేన విడిగా పోటీచేస్తే రాజకీయంగా నష్టమని తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా భయం ఉంది. ఈ కారణంగానే రాజధాని అంశాన్ని ఆ పార్టీ తెరమీదకు తెచ్చింది’
‘తమతో కలవకుండా బీజేపీ–జనసేన విడిగా పోటీచేస్తే రాజకీయంగా నష్టమని తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా భయం ఉంది. ఈ కారణంగానే రాజధాని అంశాన్ని ఆ పార్టీ తెరమీదకు తెచ్చింది’…ఈ వాక్యం చాలదా అమరావతి ఉద్యమం వెనుక టీడీపీ అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోడానికి.
బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టేననడం, అలాగే టీడీపీ భయపడుతోందని, ఈ కారణంగానే రాజధాని అంశాన్ని తెరమీదకి తెచ్చిందని ఆర్‌కేలోని అమాయకుడు ముందుకొచ్చి పచ్చి నిజాలను చెబుతున్నాడు. అధికార కాంక్షతోనే రాజధాని ఆందోళన చేపట్టినట్టు చంద్రబాబు ‘ఆత్మ’ ఆర్‌కే ఘోషిస్తోంది.
‘రోజూ చచ్చేవాడి కోసం ఏడుపు ఎందుకు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే జీవచ్ఛవం అయ్యింది. ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రానికి పెట్టుబడులు రావుగాక రావు! మూడు రాజధానుల విషయం అలా ఉంచితే ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందదు. అభివృద్ధి చేయడానికి అవకాశమున్న అమరావతిపై ముఖ్యమంత్రికి మొహం మొత్తింది. చేసేది ఏముంది – అనుభవించడమే!’
జీవచ్ఛవం అయ్యింది ఆంధ్రప్రదేశ్ కాదు ఆర్‌కే. మీరు ఆరాధిస్తున్న టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే అని గుర్తించుకోండి. అమరావతి గత చరిత్ర అవుతున్నదనే నిరాశనిస్పృహలు ఆర్‌కేలో వైరాగ్యాన్ని నింపుతున్నాయి.
‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద అభివృద్ధి చేయడానికి డబ్బు ఉందా? ఉంటే సంక్షేమ పథకాల కోసం ఎప్పటికప్పుడు అప్పులు చేయడం ఎందుకు? ఒకచోట ఉన్న కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలించినంత మాత్రాన అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిపోయినట్టేనా? ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉచిత సలహాలు ఇస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గానీ, ఆయన మంత్రులు గానీ హైదరాబాద్‌లో కొలువు దీరిన ప్రభుత్వ కార్యాలయాలు కొన్నింటిని అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎందుకు తరలించడం లేదు? ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహానగరం అవసరం లేదని జగన్ ప్రభుత్వం భావించడం ఆ రాష్ట్ర ప్రజల దురదృష్టం’.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అభివృద్ధి చేయడానికి డబ్బు ఉందా అని ప్రశ్నిస్తున్న ఆర్‌కే…ఖజానా ఖాళీ కావడానికి గత ఐదేళ్లలో బాబు దోపిడీకి నిదర్శనం కాదంటారా? అసలు కేసీఆర్ సలహాలు ఇవ్వడం ఏంటి? జగన్‌కు సలహాలిచ్చారని రాసేది మీరే, దానిపై అవాకులు చెవాకులు పేలేది మీరే. ఆంధ్రప్రదేశ్‌లో మహానగరాన్ని కొత్తగా నిర్మించవద్దని, ఆల్రెడీ ఉన్న విశాఖ మహానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తే బాగుంటుందనే తలంపుతోనే అక్కడికి మార్పు చేసేది. అన్నీ తెలిసీ తెలియనట్టు నటించే మీలాంటి వాళ్లకు జగన్ ఆలోచనలు అర్థం కావులే సార్!
‘ఇప్పుడు అమరావతిలో ఉన్న భూమి ప్రభుత్వానిది కాదా? రైతులకు పరిహారం చెల్లించి భూసేకరణ చేయలేదు కదా? ఉచితంగా సమకూరిన భూమిలో కొంత భాగం అమ్ముకుని రాజధానిని నిర్మించవచ్చునని చెబుతున్నా పాలకుల చెవికి ఎక్కకపోవడానికి దురుద్దేశాలే కారణమని స్పష్టమవుతోంది’
రాజధానికి రైతులు ఉచితంగా భూమిలిచ్చారనే పదం కంటే బూతు మరేదైనా ఉందా ఆర్‌కే? ల‌్యాండ్ పూలింగ్‌లో భూమి తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఉచితంగా ఇచ్చిన భూమిపై రైతులకు మమకారం ఎందుకు? భూములిచ్చిన రైతులు తమ ఆడబిడ్డలకు రూ.2-3 కోట్లు కట్నకానుకల కింద ఇచ్చారని రెండు వారాల క్రితం తమరే కదా రాసింది? ఉచితంపై ఇంతకూ మీరు చెప్పిందాంట్లో ఏది నిజమో వివరణ ఇవ్వండి సార్.
‘రాజకీయ ప్రత్యర్థులను లం..కొడుకు, దొంగముండా కొడుకు అని బహిరంగంగా తిట్టగలుగుతున్న నాయకులను ఎమ్మెల్యేలుగా గెలిపించినందుకు గర్వపడండి అప్పటిదాకా!’
ఎన్టీఆర్‌ను బాబు, ఉద్యోగులను మీరు (ఆర్‌కే) తిట్టడం గుర్తున్నాయ్ సార్
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుతో ఆర్‌కే స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను చంద్రబాబు ‘ వాడు’ అని సంబోధించాడు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను ఆర్‌కే ‘ ఆ…నా కొడుకులు’ అని నోరు పారేసుకున్నాడు. ఆ సంభాషణల వివరాలు…
రాధాకృష్ణః ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు?
చంద్రబాబుః వాడి పేరు మార్చాలి…మారుస్తున్నా.
రాధాకృష్ణః మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్‌గా రీవ్యాంప్ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం.
చంద్రబాబుః మార్చేస్తున్నా వేరే పేరు మార్చేస్తున్నా. వాడి (ఎన్టీఆర్) పనై పోయింది.
రాధాకృష్ణః ఆ ఓకే.
రాధాకృష్ణః ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా…? ‘ఆ.. నా కొడుకులకు’ జీతాలివ్వడానికా? జనం ట్యాక్స్‌లు (పన్నులు) కట్టేది? వద్దు వద్దు… పక్కన పెట్టేయండి… వద్దే వద్దు తీసేయండి.
చంద్రబాబుః నువ్వు చెప్పినవన్నీ (ఉద్యోగుల విషయంలో) ముమ్మాటికీ నిజాలే. కానీ వారిని కూడా లాగాలి కదా.. మనకు అధికారం ముఖ్యం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేం.
రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం.
అయ్యా రాధాకృష్ణ ఇప్పుడు చెప్పండి మీ నీతి వాక్యాలు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌నే వాడు అని దూషిస్తుంటే…తప్పు అని కనీసం వారించలేకపోయారే. ఇక తమరు మాత్రం ఏం తక్కువ. ఆ…నా కొడుకులని ఉద్యోగులను తిట్టింది వాస్తవం కాదా? ఇప్పుడు తీరిగ్గా రాజకీయ ప్రత్యర్థులను లం..కొడుకు, దొంగముండా కొడుకు అని బహిరంగంగా తిట్టగలుగుతున్న నాయకులను ఎమ్మెల్యేలుగా గెలిపించినందుకు గర్వపడండి అప్పటిదాకా! అని చాగంటి కోటేశ్వరరావులా ఉపన్యాసాలు చెబుతున్నాడు.
మీడియా సంస్థను గుప్పిట్లో పెట్టుకుని జర్నలిజంలో పే…ద్ద తోపులమని చెలామణి అవుతున్నాడు.ఆర్‌కే… మీ పాపం పండే ఓ రోజు వస్తుందని ఇప్పటికైనా గుర్తించి అక్షరాన్ని గౌరవిస్తే మంచిది.