‘మీలో పౌరుషం, రోషం లేవా? ఇదంతా నా ఒక్కడికేనా? సమస్య నా ఒక్కడిది కాదని, ఐదు కోట్ల మందిదని తెలుసుకోవాలి. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు.. కులం కోసమో, కుటుంబం కోసమో అంతకన్నా కాదు.. ఇదంతా మీకోసం’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల్ను రెచ్చగొట్టే యత్నం చేశాడు.
సీఎం జగన్ అమరావతిపై కక్ష కట్టి విధ్వంసం చేస్తున్నాడని ధ్వజమెత్తాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు. అమరావతి పరిరక్షణ సమితి పక్షాన జోలె పట్టారు. నారాయణపురం, గణపవరం, ఉండి, భీమవరం, పాలకొల్లు, మార్టేరు సభల్లో చంద్రబాబు మాట్లాడాడు.
అమరావతి ఉద్యమంలో 20 మంది అసువులు బాశారని, ఇవన్నీ హత్యలే.. జగనే చంపేశాడని తీవ్ర విమర్శలు చేశాడు. అటువంటి వ్యక్తిని బలి ఇవ్వాలా.. వద్దా..? కరుడు కట్టిన దుర్మార్గుడు, నరరూప రాక్షసుడైన జగన్‌కు పరిపాలించే అర్హత లేదని విమర్శల డోస్ పెంచాడు.
కానీ చంద్రబాబు విస్మరించిన విషయం ఒకటి ఉంది. ఏడు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లకు ఏపీ ప్రజలు పరిమితం చేశారు. అలాగే వైసీపీకి 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ సీట్లను కట్టబెట్టి అధికార పీఠంపై కూర్చో పెట్టారు. గతంలో చంద్రబాబు హామీలను నెరవేర్చకపోవడం, జన్మభూమి కమిటీల పేరుతో అరాచకాలను సృష్టించడం, ఇసుక, మన్ను దోపీడీ యథేచ్ఛగా సాగనివ్వడం, మహిళలు, దళితులపై విచక్షణా రహితంగా దాడులు చేయడం, విపరీతమైన అవినీతి….తదితర అంశాలు జనంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి.
ఇలా అనేక కారణాలతో కష్టాలకు గురవుతున్న ఏపీ ప్రజలు అదును చూసి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పి…తమ పౌరుషం, రోషం ఏంటో రుచి చూపారు. ఆ విషయాన్ని చంద్రబాబు చాలా కన్వీనియంట్‌గా మరిచి…తన రాజధాని సమస్యను అందరి సమస్యగా చిత్రీకరించడాన్ని ప్రజలు పట్టించుకోకపోవడంతో అసహనానికి గురవుతున్నాడు. దీంతో పౌరుషం, రోషం లేదా అని రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నా జనం నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.