జన సైనికులారా త్యాగాలకు సిద్ధంకండి

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ టికెట్లంటే అందరికీ రావు కానీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ఓ మోస్తరుగా పార్టీకి పనిచేసిన వారికి టికెట్లు వచ్చే అవకాశాలుంటాయి. అందులోనూ…

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ టికెట్లంటే అందరికీ రావు కానీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ఓ మోస్తరుగా పార్టీకి పనిచేసిన వారికి టికెట్లు వచ్చే అవకాశాలుంటాయి. అందులోనూ అందరూ విద్యావంతులే కాబట్టి మిగతా వారితో పోటీపడి మరీ మేం అభివృద్ధి చేస్తాం, మార్పు చూపిస్తామంటూ ప్రచారం చేసుకోవచ్చు. దీనికి అనుగుణంగానే కొత్త రక్తానికే స్థానిక పోరులో టికెట్లిస్తాం అని జనసేనాని గతంలో ప్రకటించారు. 

అయితే బీజేపీ-జనసేన పొత్తు ప్రకటనకు ముందుమాట అది. ఇప్పుడు పొత్తు పొడిచింది. ఇకపై అన్ని ఎన్నికల్లోనూ కలసే పనిచేస్తాం, 2024లో అధికారం కోసం ముందుకెళ్తామని ఇరు పక్షాల నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది జనసైనికులు త్యాగాలు చేయక తప్పేలాలేదు. దీనికి తగ్గట్టుగానే జిల్లాలవారీగా నేతలతో పవన్ కల్యాణ్ మీటింగ్ లకు ఏర్పాటు చేయాలని కీలక నేతల్ని పురమాయించారు. 

స్థానిక పోరు కోసం ఈ మీటింగ్ లు జరుగుతాయని ప్రకటించారు కానీ, త్యాగాలకు రెడీగా ఉండాలని ప్రిపేర్ చేయడమే వీటి ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. స్థానిక పోరులో భాగంగా ఎక్కువ చోట్ల బీజేపీకే అవకాశమివ్వాలని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే కనుక జరిగితే చాలా చోట్ల మరోసారి జనసైనికులు భంగపాటుకు గురవ్వక తప్పదు. మొన్నటివరకు టీడీపీ జెండా మోసిన సైనికులు, ఇప్పుడు బీజేపీ జెండా మోస్తారంతే. 

కొత్త రక్తం, యువతకు అవకాశం అంటూ కబుర్లు చెప్పిన పవన్ కల్యాణ్.. తమ కూటమి తరపున పాతకాపుల్నే నిలబెడతారన్నమాట. అలా సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు మొండిచేయి చూపించబోతున్నారు పవన్. కూటమి లేకపోతే ఔత్సాహికులంతా ఈ దఫా బరిలో దిగి తమ బలాబలాలపై ఓ అంచనాకు వచ్చి ఉండేవారు. కానీ పవన్ పొత్తు వ్యవహారంతో అది సాధ్యం కావడంలేదు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపిన పవన్, ఇప్పుడు జిల్లాల వారీ మీటింగ్ లు పెట్టి త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చెప్పబోతున్నారు.