“అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి షారూక్ ముందుకొచ్చాడంట. ఈ మేరకు రామ మందిర్ ట్రస్ట్ కు సమాచారం అందించాడట.”
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. 2 రోజుల కిందట ప్రధాని చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి షారూక్ తన వంతుగా 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడానికి సిద్ధమైనట్టు ఓ గ్రాఫిక్ ప్లేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
షారూక్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సీనియర్ మేనేజర్ ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఆ గ్రాఫిక్ కథనం. అయితే ఇదంతా ఉత్తిదే. షారూక్ విరాళం అంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలని తేలింది. అంతేకాదు.. దైనిక్ భాస్కర్ మీడియాలో వచ్చిన విరాళం వార్తలో కూడా నిజం లేదు, ఎవరో కావాలనే ఈ ఫేక్ ప్రచారాన్ని సృష్టించారు..
ఇదొక్కటే కాదు.. రీసెంట్ గా షారూక్ పై మరో ప్రచారం కూడా జరిగింది. షారూక్ ఆ మధ్య తన ఇంటి మొత్తాన్ని ప్లాస్టిక్ కవర్ తో కప్పేశాడు. కరోనా నుంచి కాపాడుకునేందుకు షారూక్ ఇలా తన ఇంటికే మాస్క్ వేశాడంటూ తెగ ప్రచారం నడిచింది. అయితే వర్షాల నుంచి తన ఇంటిని కాపాడుకునేందుకు షారూక్ ప్రతి ఏటా ఇలానే చేస్తాడనే విషయం వెలుగులోకి రావడంతో, ఆ పుకార్లు ఆగిపోయాయి.