ఓవైపు మీ-టూ ఉద్యమానికి మహిళలంతా మద్దతు తెలుపుతుంటే షకీలా మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అసలు కాస్టింగ్ కౌచ్ ఉదంతాల్ని మీ-టూ ఉద్యమం వరకు తీసుకురావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు షకీలా. ఘటన జరిగినప్పుడే గట్టిగా రియాక్ట్ అయితే, మరొకరి ముందు గోడు చెప్పుకునే అవసరం వచ్చేది కాదనేది షకీలా లాజిక్.
“కాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి చాలామంది బయటకు వచ్చి చెబుతున్నారు. అలావచ్చి నలుగురితో చెప్పుకునేకంటే, మనకు మనంగా హ్యాండిల్ చేసుకోవచ్చనేది నా ఫీలింగ్. నాకు అలా జరిగిందని చెప్పుకోవడం, వాడు నన్ను అలా చేశాడని చెప్పుకోవడం, వీడు నన్ను ఇలా చేశాడని బయటకు చెప్పుకోవడం ఎందుకు? ఘటన జరిగినప్పుడే అక్కడికక్కడే గట్టిగా డోస్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనేది నా అభిప్రాయం. కాస్టింగ్ కౌచ్ ఘటనల్ని బయటకు చెప్పడం కంటే, ముందు మనం ఆ టైమ్ లో ఎంత గట్టిగా ప్రతిఘటించామనేది ఇంపార్టెంట్.”
తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి గతంలోనే స్పందించిన షకీలా.. అవకాశాల కోసం ఒకర్ని సంప్రదిస్తే, వాళ్లు చెప్పినట్టు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే తను అవకాశాల కోసం వెంపర్లాడలేదని అంటున్నారు. తనకు ఏం కావాలో ఆ భగవంతుడికి తెలుసని, ప్రస్తుతం తను హ్యాపీగా ఉన్నానని అంటున్నారు.
“సినిమా అవకాశాలు తగ్గినప్పుడు నేను ఎవ్వర్నీ కలవలేదు. అవకాశం ఇప్పించమని కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎప్పటికీ అలా చేయను. నాకేది రావాలో అది తప్పకుండా వస్తుంది. మనం ఏదైనా కోరితే, అవతలి వ్యక్తులు చెప్పేది మనం చేయాల్సి వస్తుందనే భయం. అందుకే ఎవ్వరికీ ఫోన్లు చేయలేదు, ఛాన్సులు కావాలని అడగలేదు. వచ్చినవి చేసుకుంటూ వచ్చాను.”
ప్రస్తుతం తనకు ఛాన్సులు తగ్గిన విషయాన్ని అంగీకరించారు షకీలా. తనకు ఎవ్వరూ అవకాశం ఇవ్వడం లేదని, అందుకే సినిమా నిర్మాణ రంగంలోకి మెల్లగా అడుగులు వేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఓ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్న షకీలా.. తనకు సినిమాలు తప్ప బయట లోకం తెలియదంటున్నారు.