తనచుట్టూ జరిగే ఏ విషయాన్నీ ఊరికే వదిలిపెట్టే రకంకాదు రామ్ గోపాల్ వర్మ. దాంట్లో తనకీ తన సినిమాల ప్రచారానికి పనికొచ్చే మెటీరియల్ ని వెదికి మరీ పట్టుకుంటాడు. దాంట్లో ఉప్పూకారం చల్లుతాడు. ఇలా టాలీవుడ్ లో విడుదలయ్యే ప్రతి సినిమాపై తనదైన శైలిలో స్పందిస్తాడు. అలాంటి వర్మ సైరాని మాత్రం పూర్తిగా పక్కనపెట్టాడు.
ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల టైమ్ లో వర్మచేసిన రచ్చ అంతా ఇంతాకాదు. ఆ స్టిల్ అలా తీయాల్సింది కాదని, ఈ లుక్ ఇలా ఉండాల్సింది కాదని సోషల్ మీడియాలో తెగ ఇదైపోయాడు. మెగాస్టార్ 150వ సినిమా డైరక్షన్ కి తను కూడా ట్రై చేసి భంగపడిన వర్మ చివరకు అలా తన అక్కసునంతా వెళ్లగక్కాడు. అన్నయ్యను అలా చూపిస్తే బాగుండేది, ఇలా చూపిస్తే బాగుండేది అంటూ విడుదలయ్యే వరకు సినిమాని వెంటాడాడు. చివరకు ఖైదీ నెంబర్ 150 హిట్ కొట్టే సరికి సైలెంట్ అయ్యాడు.
ఇప్పుడు సైరా విషయంలో వర్మ ఎందుకో వేలుపెట్టే సాహసం చేయడంలేదు. ఆమధ్య సాహో సినిమా విషయంలో కూడా తనకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంటూ ప్రభాస్ గురించి ట్వీట్ చేసి పనిలో పనిగా తన కడపరాజ్యంలో కమ్మరెడ్లు క్యాస్ట్ ఫీలింగ్ పాటకి బోలెడు పబ్లిసిటీ చేసుకున్నాడు వర్మ. తన శిష్యుడు పూరీ తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్టైనప్పుడు కూడా ఆర్జీవీ హడావిడి అంతా ఇంతా కాదు. అలాంటి వర్మ సైరా నరసింహారెడ్డి జోలికి రాకపోవడం ఆశ్చర్యమే.
పోనీ మీడియాకీ, సోషల్ మీడియాకీ దూరంగా వర్మ ఉన్నాడా అంటే అదీ లేదు. “బాబు చంపేస్తాడు..” అనే పాట కోసం ట్విట్టర్లోకి వచ్చిన వర్మ సైరా ట్రయిలర్ గురించి కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కానీ నోరు మెదపకపోవడం విశేషమే. మెగా ఫ్యామిలీ సైడ్ నుంచి వర్మకి ఏమైనా ఫుల్ డోస్ పడిందా అంటే అలాంటి వాటికి బెదిరే టైపు కాదు మనోడు. ఒకవేళ బెదిరించినా పూర్తిగా రివర్స్ లో ఎక్కేస్తాడు. అందుకే ఎవరూ వర్మని అంత తొందరగా కదిలించరు.
ఎవరూ తనను కదిలించకపోయినా తానే అందర్నీ కెలుక్కుని మరీ వివాదాలు రాజేసుకునే రామ్ గోపాల్ వర్మ సైరా నరసింహా రెడ్డిని మాత్రం కదిలించకుండా తన భక్తిభావాన్ని చూపిస్తున్నాడనుకోవాలి.