ప్రతి సినిమా విడుదలకు ముందు దానికి హైప్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు బోలెడన్ని టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తుంటారు. వారి బుర్రలో చాలా చాలా ఎత్తుగడలు ఉంటాయి.
ఆ మధ్య విష్వక్సేన్ సినిమాను ప్రమోట్ చేసుకోడానికి ఎలాంటి వేషాలతో అభాసుపాలయ్యాడో అందరికీ తెలుసు. రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లయితే కేవలం తన సినిమా విడుదలకు ముందు సీజనల్ గా అడ్డమైన ప్రతి యూట్యూబ్ చానెల్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి, ఆ చానెల్ వాళ్ల వ్యూస్ పెరగడం కోసం నానా బూతు వ్యవహారాలు వారితో చర్చించేసి, ఇంటర్వ్యూ చేసే యాంకర్లతో కూడా తమ కామకేళీవాంఛలను వెల్లడించేసి (వ్యూస్ కోసం మాత్రమే సుమా, ఆయన నిజానికి అంత పర్వర్ట్ కాదు) .. ఈ వికటయత్నాలన్నీ సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడతాయని భ్రమిస్తుంటారు.
ఇలాంటి అనేకానేక ప్రయత్నాల్లో విడుదలకు ముందు సినిమాను ప్రీమియర్ షోలుగా కొందరికి చూపించి.. వారితో భజన చేయించుకోవడం ద్వారా.. ప్రజల్లో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం కూడా ఒకటి. అనేకమంది అనుసరిస్తున్న పద్ధతి ఇది.
ఇలాంటి ప్రయత్నం కూడా అన్నివేళలా సక్సెస్ అవుతుందనే నమ్మకం లేదు. ప్రీమియర్ లు వేసి చూసిన వాళ్లందరితోనూ సోషల్ మీడియాలో భజనలు చేయించుకుని విడుదలైన రంగమార్తాండ కొన్ని షోల వ్యవధిలోనే తుస్పుమంది. భజనల స్ట్రాటెజీ దారుణంగా ఫెయిల్ అయింది.
ఇప్పుడు దిల్ రాజు శాకుంతం సినిమాకు ఈ భజనల స్ట్రాటజీనే అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రమోషన్ కోసం నానా రకాల వక్రమార్గాలు తొక్కారు.
ఈసినిమా ఆడడం అనేది సమంతకు కూడా చాలా అవసరం. అందుకే ఆమె సినిమా ప్రమోషన్స్ లో తన వ్యక్తిగత విషయాలు కూడా లీక్ చేస్తూ, విడాకులకు కారణాలను కూడా బయటపెడుతూ.. ఎలాగైనా సరే.. సినిమాకు జనాన్ని రప్పించేలా తాను వార్తల్లో హాట్ టాపిక్ లాగా ఉండాలనుకుంటున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ కోసం నటీనటులతో ఇప్పించే ఇంటర్వ్యూలను వీలైనంత స్పైసీగా రూపొందించడం కూడా ఒక ఎత్తుగడ.
భజనలు చేయించుకోవడం కోసం వేయించిన ప్రీమియర్ షోల టెక్నిక్ దారుణంగా ఫెయిలైంది. చాలా మంది అసలు దీని గురించి మాట్లాడ్డం లేదు. ఈలోగా నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అసలే గ్రాఫిక్స్ వ్యామోహంలో పడి, తాను ఎంత గొప్పగా గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను చీట్ చేయగలిగానా? అనేది తప్ప మరొక ధ్యాస ఉండని దర్శకుడు చేసిన సినిమా తీరా వెండితెర మీద పడిన తర్వాత గానీ అసలు సత్తా తెలియదు.
మంచి సినిమాకు బీభత్స ప్రమోషన్ లేకపోయినా.. విడుదల తర్వాత ఊపేస్తుంది. చెత్తసినిమాకు ఎంత గొప్ప హైప్ క్రియేట్ చేసినా.. ఎడ్వాన్సు బుకింగులే తప్ప.. ఆ తర్వాత దిక్కూమొక్కూ ఉండదు. ఈలోగా డొల్లతనం బయటపడిపోతుంది. ఇది చాలా పురాతన సిద్ధాంతం అయినప్పటికీ.. దిల్ రాజు ఎందుకింత తప్పటడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు. శాకుంతలం విషయంలో భజన కోసం వేయించిన ప్రీమియర్ షోల దెబ్బ నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోతోంది.