తమ నటనే పునాదిగా భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటీనటుల్లో ప్రపంచంలోనే ఫోర్త్ రిచెస్ట్ గా నిలుస్తున్నాడట బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్. ఒక ఆర్థిక గణాంకాల సంస్థ వేసిన అంచనాల ప్రకారం.. షారూక్ అత్యంత ధనిక నటుల్లో నాలుగో స్థానంలో నిలుస్తున్నాడు. ఈ జాబితాలో హాలీవుడ్ నటీనటుల కన్నా షారూకే ముందు వరసలో ఉండటం గమనార్హం. ఆ సంస్థ అంచనాల ప్రకారం.. షారూక్ మొత్తం ఆస్తుల విలువ ఆరు వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది!
ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు అమెరికన్ నటుడు, స్టాండప్ కమేడియన్ జెర్రీ సీన్ ఫీల్డ్ ఈ జాబితాలో నిలుస్తున్నాడు. ఇతడి సంపద విలువ సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు. అమెరికా టెలివిజన్ నటుడు టేలర్ పెర్రీ కూడా దాదాపు ఇదే స్థాయి సంపదతో రెండో స్థానంలో నిలిచాడు. ది రాక్ డ్వేన్ జాన్సన్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో షారూక్ ఖాన్ ఆరు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో నిలుస్తున్నాడు ఆ జాబితాలో.
ఆరో స్థానంలో టామ్ క్రూస్ ఉన్నాడు. ఆ తర్వాత జాకీచాన్, ఆ తర్వాత జార్జ్ క్లూనీ ఆ తర్వాతి స్థానంలో విఖ్యాత నటుడు రాబర్డ్ డి నీరో నిలుస్తున్నాడు. మొత్తానికి హాలీవుడ్, అమెరికన్ నటీనటుల్లో అక్కడి స్టార్ల కన్నా ఎక్కువ స్థాయిలో ఆస్తుల సంపాదించినట్టుగా ఉన్నాడు షారూక్. ప్రపంచంలో పేరున్న నటీనటులెంతోమంది ఉన్నా.. ఆస్తుల విలువలో మాత్రం షారూక్ తో పోటీపడేవారు తక్కువమందే ఉన్నట్టున్నారు.
టెలివిజన్ రంగం నుంచి వచ్చి సినిమాల్లో స్టార్ అయిన షారూక్ చాలా యేళ్ల నుంచి నిర్మాతగా సినిమాలు తీస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ బోలెడన్ని సినిమాలు నిర్మించాడు. గత కొన్నేళ్లుగా షారూక్ కు హీరోగా సరైన హిట్స్ లేవు. అయితే ఇదే సమయంలో షారూక్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ యజమానిగా కూడా షారూక్ వ్యవహరిస్తున్నాడు. ఆ క్యాష్ రిచ్ లీగ్ లో ఆరంభంలోనే షారూక్ పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అనేక రెట్లు అయ్యాయి. ఇలాంటి వ్యాపారాలతో కూడా షారూక్ సంపద ఈ స్థాయికి పెరిగి ఉండవచ్చు.