కొహ్లీ.. ఇంకో నాలుగు కొడితే!

త‌న సెంచ‌రీల వేట‌ను మ‌ళ్లీ ఊపెక్కిస్తున్నాడు విరాట్ కొహ్లీ. గ‌త ఏడాదికి చివ‌ర్ల బంగ్లాదేశ్ పై వ‌న్డే సెంచ‌రీతో ముగింపును ఇచ్చిన విరాట్ కొహ్లీ ఈ సంవ‌త్స‌రంలో తన తొలి వ‌న్డేని కూడా సెంచ‌రీతో…

త‌న సెంచ‌రీల వేట‌ను మ‌ళ్లీ ఊపెక్కిస్తున్నాడు విరాట్ కొహ్లీ. గ‌త ఏడాదికి చివ‌ర్ల బంగ్లాదేశ్ పై వ‌న్డే సెంచ‌రీతో ముగింపును ఇచ్చిన విరాట్ కొహ్లీ ఈ సంవ‌త్స‌రంలో తన తొలి వ‌న్డేని కూడా సెంచ‌రీతో ఆరంభించాడు. వ‌న్డే కెరీర్ లో కొహ్లీ 45వ సెంచ‌రీని పూర్తి చేశాడు. త‌ద్వారా సచిన్ వ‌న్డే సెంచ‌రీల రికార్డుకు మ‌రింత చేరువ‌య్యాడు.

రెండేళ్ల నుంచి కొహ్లీ సెంచ‌రీల విష‌యంలో గ‌త ఊపుతో క‌నిపించ‌లేదు. ఒక‌వేళ మునుప‌టి ఫామ్ నే కొన‌సాగించి ఉంటే ఈ పాటికి కొహ్లీ సెంచ‌రీల లెక్క‌లు మ‌రోలా ఉండేవి. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఫామ్ ను అందుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో వ‌న్డేల్లో సచిన్ నెల‌కొల్పిన 49 సెంచ‌రీల లెక్క‌కు చేర‌వ‌య్యాడు. ఇంకో నాలుగు సెంచరీలు కొడితే కొహ్లీ స‌చిన్ తో సెంచ‌రీల విష‌యంలో వ‌న్డేల వ‌ర‌కూ స‌మంగా నిలుస్తాడు. ఐదు సెంచ‌రీలు చేస్తే.. యాభై సెంచ‌రీల‌తో స‌రికొత్త రికార్డును నెల‌కొల్పుతాడు.

త‌న కెరీర్ ముగిసే స‌మ‌యానికి సచిన్ వ‌న్డే, టెస్టులు క‌లిపి వంద సెంచ‌రీల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. వ‌న్డేల్లో 49 సెంచ‌రీలు చేసిన స‌చిన్ టెస్టుల్లో 51 సెంచ‌రీల‌తో వంద సెంచ‌రీల‌ను పూర్తి చేశాడు. అయితే ఆ రికార్డుకు మాత్రం కొహ్లీ చాలా దూరంలోనే ఉన్నాడు. అన్నీ క‌లిసి కొహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కూ 73 సెంచ‌రీల‌ను సాధించాడు. ఒక‌వేళ వంద సెంచ‌రీలకు చేరువ కావాలంటే కొహ్లీ ఇంకో 27 సెంచ‌రీలు సాధించాల్సి ఉంది. అయితే అదంత తేలిక కాక‌పోవ‌చ్చు!

టెస్టుల్లో స‌చిన్ సెంచ‌రీల స్థాయిని అందుకోవ‌డం కూడా కొహ్లీకి తేలిక‌గా లేదు. వ‌న్డేల్లో మాత్రం స‌చిన్ రికార్డును అధిగ‌మించి కొత్త రికార్డును సెట్ చేయ‌వ‌చ్చు ఈ స్టార్ ప్లేయ‌ర్. ఒక ద‌శ‌లో టెస్టుల్లో కూడా స‌చిన్ సెంచ‌రీల రికార్డును తిర‌గ‌రాస్తాడ‌నిపించిన కొహ్లీ ఇప్పుడు మాత్రం ఆ ఊపుతో క‌నిపించ‌డం లేదు!