'వైల్డ్ కార్డ్ ఎంట్రీ' అంటూ ఎవరైనా కాస్త ఆసక్తిని రేకెత్తించగలిగిన వారిని లోపలకు పంపిస్తారనుకుంటే, జనాలు ఎప్పుడో మరిచిపోయిన శిల్పా చక్రవర్తిని పంపించారు. కొంతమందికి అయితే ఆమె ఇప్పుడే పరిచయం అట! ఎప్పుడో పాత కాలం టీవీ షో ల యాంకర్ గా శిల్పా చక్రవర్తికి కొంత వరకే గుర్తింపు ఉంది. అలాంటి ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ పంపించడంపై విమర్శలు వచ్చాయి. ఇంకెవరూ దొరకలేదా? అంటూ కామెంట్లు వినిపించాయి.
మరి అలా లోపలకు పంపించారో లేదో.. ఇంతలోనే శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయ్యింది. ఎంటర్ అయిన తొలి వారంలో శిల్పాకు ఎగ్జిట్ భయం లేదు, అయితే రెండో వారంలోనే ఆమె నెట్టుకురాలేకపోయింది. ప్రేక్షకుల ఓట్ల లెక్కతో ఆమె ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు.
ఇలా బిగ్ బాస్ త్రీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎలిమినేట్ అయ్యే వారి లిస్టులో శ్రీముఖి, మహేశ్ విట్టా, పునర్నవిలు ఉండగా.. వారందరిలో కెళ్లా తక్కువ ఓట్లు పొంది శిల్పా చక్రవర్తి తట్టాబుట్టా సర్దేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ బిగ్ బాస్ నిర్వాహకులు చేసిన హడావుడి కూడా శిల్పా చక్రవర్తి ఎగ్జిట్ తో ప్రహసనం అయ్యింది.
ఇక తీన్మార్ సావిత్రి ఊరికే ధారాళంగా కార్చేసే తన కన్నీటి కొళాయిని కట్టేసిందని నాగార్జున కూడా మెచ్చుకుంటున్నారిప్పుడు. ఆమె కన్నీటితో కాళేశ్వరం ప్రాజెక్టు నిండుతుందంటూ కొంతమంది వీక్షకులు సెటైర్లు వేసేవాళ్లు. ఇప్పుడు ఆమె ఆ తీరును మార్చుకున్నట్టుగా ఉంది!