కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గత కొన్నాళ్లుగా పుకార్లు, గుసగుసలుగా ఉన్న అంశాల గురించి ఆయన సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడారు. కేసీఆర్ విరోధులు అయినా ఆ అంశాల గురించి నర్మగర్భంగా మాట్లాడతారేమో కానీ, కేసీఆర్ మాత్రం సూటిగా మాట్లాడారు.
ఏయే అంశాల గురించి అంటే…‘‘కేసీఆర్ ఆరోగ్యం ఖతమైందట గదా, అమెరికాకు పోతడట గదా, అంటూ చెప్తున్నారు. నేను సచ్చిపోబట్టి 20 ఏళ్లు అయె. నేనేం సావలె. ఇప్పుడు కూడా దుక్కలా ఉన్న. కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ను దించుడు పక్కానేనా అని ఇప్పుడు కూడా అడుగుతున్నరు. నేనెందుకు చేస్తా. నాకు పాణంవాటం లేదా? ఏమైందని?
గ్యారంటీగా 100కు 100 శాతం టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ టర్మ్ ఆవల కూడా రెండు టర్ములుంటది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నాకు 66 ఏండ్లు. ఇంకా పదేళ్లు అయినా చేయనా? ఈ టర్మ్ నేనే ఉంటా. వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా. నేను చెప్పినవన్నీ జరిగినవి. ఇది కూడా జరుగతది..’’ అంటూ కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.
వచ్చే రెండు టర్ములు అధికారం తెలంగాణ రాష్ట్ర సమితిదే అని, అది కూడా తనే సీఎం అని కూడా కేసీఆర్ ప్రకటించుకున్నారు. ఇన్నిరోజులూ తన ఆరోగ్యం విషయంలో, తన వారసత్వం విషయంలో ఉన్న రకరకాల పుకార్లకు చెక్ పెట్టడానికి, ప్రత్యేకించి వారసత్వం విషయంలో జరుగుతున్న చర్చకు కూడా తెర వేయడానికి కేసీఆర్ సూటిగా స్పందించినట్టున్నారు!