పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ఈమెతో వైవాహిక జీవితంలో ఉంటూనే, రష్యాకు చెందిన మహిళతో పవన్ సంబంధం పెట్టుకున్నారు. ఆమె ద్వారా బిడ్డకు తండ్రి కూడా అయ్యారు. ఇవి ఆరోపణలు కావు. 2-3 సందర్భాల్లో రేణు దేశాయ్ స్వయంగా వెల్లడించిన వాస్తవాలు.
పవన్ పై రేణుదేశాయ్ కు పీకల వరకు కోపం ఉంది. ఆ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఎన్నోసార్లు బయటపెట్టింది కూడా. ఈ క్రమంలో ఆమె పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కూడా గురైంది. ఇలా పవన్ పేరు చెబితే కస్సుమనే రేణుదేశాయ్, ఒక్కసారిగా రూటు మార్చింది. పవన్ చాలా మంచోడు అంటోంది.
“నా మాజీ భర్తకు మద్దతుగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చాలామందికి అర్థంకాకపోవచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఆయన నాకు అన్యాయం చేశారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అది నా వ్యక్తిగతం. అయితే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. సమాజానికి ఏదో చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన చాలా అరుదైన వ్యక్తి. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బుపై ఆయనకు ఆసక్తి లేదు. సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటాడు.”
ఇలా ఉన్నట్టుండి పవన్ ను వెనకేసుకొచ్చింది రేణుదేశాయ్. వ్యక్తిగతంగా తనకు పవన్ పై కోపం ఉన్నప్పటికీ… దాన్ని పక్కనపెట్టి, రాజకీయంగా సపోర్ట్ చేస్తానని ప్రకటించింది. రాజకీయంగా ఆయనకు ఓ అవకాశం ఇవ్వాలని అందర్నీ కోరుతోంది.
“ఆయన సక్సెస్ ఫుల్ హీరో. కావాలంటే సినిమాల్లో కొనసాగవచ్చు. కావాల్సినంత క్రేజ్, డబ్బు వస్తుంది. కానీ ఆయన రాజకీయాలు ఎంచుకున్నాడు. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టాడు. ఆయన దగ్గర నేను లేకపోయినా, ఆయన్ను గమనిస్తూనే ఉన్నాను. ఆయన రాజకీయంగా నిజాయితీగా ఉన్నారు. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ చెబుతున్నాను, ఆయనకు ఓ అవకాశం ఇవ్వండి. నేను ఆయన మాజీ భార్యగా చెప్పడం లేదు, సమాజానికి చెందిన ఓ పౌరురాలిగా చెబుతున్నాను.”
పవన్ వల్ల వ్యక్తిగతంగా తను చాలా నష్టపోయానని, 11 ఏళ్లు ఆ బాధను అనుభవించానని చెప్పిన రేణుదేశాయ్.. తను ఎలాగైతే అన్నీ మరిచిపోయి జీవితాన్ని కొనసాగిస్తున్నానో.. అలాగే మిగతావాళ్లు కూడా పవన్ 3 పెళ్లిళ్ల వ్యవహారాన్ని వదిలేయాలని రేణు కోరారు.
తన మొత్తం వీడియోలో ఆమె చెప్పాలనుకున్న పాయింట్ ఒక్కటే. పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఒక అవకాశం ఇవ్వాలనేది ఆమె విజ్ఞప్తి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పవన్ కు మద్దతుగా రేణు దేశాయ్, ఇలా ఉన్నఫలంగా తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.