తన సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత విషయాల్ని కూడా బయటపెట్టడానికి ఏమాత్రం సంకోచించదు హీరోయిన్ శృతిహాసన్. లండన్ బాయ్ ఫ్రెండ్ కోర్సల్ నుంచి విడిపోయిన తర్వాత తక్కువ టైమ్ లోనే శాంతను హజారికా అనే వ్యక్తికి కనెక్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. డూడుల్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న శాంతను, హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం చాలా క్లోజ్ గా ఉన్నారనే విషయం ఓపెన్ సీక్రెట్.
ఈ విషయాన్ని గతంలోనే ఫొటోలతో సహా వెల్లడించిన శృతిహాసన్.. ఇప్పుడు తన ''కొత్త స్నేహితుడి''కి సంబంధించి మరిన్ని విషయాలు మోసుకొచ్చింది. లాక్ డౌన్ టైమ్ లో బాయ్ ఫ్రెండ్ తో లాక్ అయ్యానంటూ కొన్ని ఫొటోలు పెట్టడంతో పాటు ఏకంగా ఇనస్టాగ్రామ్ లైవ్ కూడా ఇచ్చింది. ఇందులో తన కొత్త బాయ్ ఫ్రెండ్ కు సంబంధించి మరిన్ని వివరాలు బయటపెట్టింది.
ఇద్దరూ కలిసి ఎంత టైమ్ గడుపుతారనే ప్రశ్నకు ''రోజంతా'' అనే సమాధానం ఇచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం రోజులో 24 గంటలు శాంతనుతోనే గడుపుతున్నానని తెలిపింది. ఇక ఈ కొత్త డేటింగ్ లో తనే వంట చేస్తున్నానని, తన బాయ్ ఫ్రెండ్ ఆలూ కర్రీ లాంటివి మాత్రం చేస్తాడని చెప్పుకొచ్చింది.
ఇష్టాఇష్టాల గురించి చెబుతూ.. శాంతను పాలు, పంచదార లేకుండా అస్సాం టీ తాగుతాడని..తనకు మాత్రం టీలో అన్నీ ఎక్కువగా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక అత్యంత కీలకమైన.. ''ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నారనే'' ప్రశ్నకు మాత్రం శృతిహాసన్ సమాధానం దాటేసింది. అది మాత్రం ఎప్పటికీ సీక్రెట్ అంటోంది.
మొత్తమ్మీద ఈ లాక్ డౌన్ టైమ్ ను బాయ్ ఫ్రెండ్ తో సరదాగా గడిపేస్తోంది శృతిహాసన్. అన్నట్టు రీసెంట్ గా శాంతను పుట్టినరోజు వేడుకల్ని కూడా శృతిహాసన్ ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఇన్ స్టాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ చూసిన జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. తమన్న లాంటి హీరోయిన్లయితే క్యూట్ కపుల్ అంటూ ఓపెన్ గానే రియాక్ట్ అవ్వడం విశేషం.