తమిళనాట పోలీసుల కస్టడీలో తండ్రీకొడుకులు మరణించిన వ్యవహారం సంచలనంగా మారింది. తూత్తుకొడి జిల్లాలో సతాన్కులం టౌన్లో జయరాజ్, ఫెనిక్స్ అనే తండ్రీ కొడుకులు పోలీసులు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై అనేక మంది విరుచుకుపడుతూ ఉన్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై స్పందించారు.
అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. విచారణకు ఆదేశించినట్టుగా ఉంది. అలాగే మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అకారణంగా ఇలా మనుషులను చంపి, పరిహారాలను ప్రకటిస్తే ఏమొస్తుందనే విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నటి-రాజకీయ నేత కుష్భూతో సహా అనేక మంది ఈ ఘటనపై స్పందించారు. సినీ దర్శకుడు హరి కూడా ఈ ఘటన విషయంలో స్పందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. తమిళంలో పోలీసులను బాగా హైలెట్ చేస్తూ సినిమాలు చేసిన దర్శకుడు హరి. సామి, సింగం సీరిస్ లో మూడు సినిమాలు, స్వామీ స్క్వైర్ అంటూ ఇంకో సినిమా.. వీటన్నింటిలోనూ పోలీసులను ఈ రేంజ్ హీరోలుగా ఈ దర్శకుడు చూపారో తెలుగు ప్రేక్షకులకూ తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో హరి స్పందించారట. తమిళనాడు పోలీసుల దురాగతం నేపథ్యంలో.. పోలీసులను ఆ స్థాయి హీరోలుగా చూపినందుకు ఒక రకమైన విచారం వ్యక్తం చేస్తున్నాడు ఆ దర్శకుడు. పోలీసులు మరీ అంత గొప్ప వాళ్లు కాదని ఇప్పుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు ఆ దర్శకుడు.