బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ సెలబ్రిటీలు తమదైన శైలిలో విమర్శలు, అభిప్రాయాలు ఓపెన్‌గా వెల్లడిస్తున్నారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు లేట్‌గానైనా లేటెస్ట్‌గా స్పందించాడు. తన అభిమానులంతా సుశాంత్ ఫ్యాన్స్‌కు అండగా నిలవాలని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ట్విటర్ వేదికగా కోరాడు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ గాయని సోనా మహాపాత్ర మరోసారి సల్మాన్‌ఖాన్‌పై విరుచుకుపడింది. సల్మాన్‌పై ఆరోపణలు గుప్పించడం ఈ గాయనికి కొత్తేమి కాదు. ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో సల్మాన్‌పై సోనా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈ దఫా సుశాంత్ ఆత్మహత్య, ఆ తర్వాత సల్మాన్ ట్వీట్…సోనా విమర్శలకు కారణమయ్యాయి.
“విషపూరిత స్వభావం కలిగిన, పెద్ద హృదయం కలిగిన ఓ వ్యక్తి నుంచి ఓ పెద్ద కదలిక (పీఆర్ మూవ్). అతని డిజిటల్ పెయిడ్ ఆర్మీ గతంలో ఇతరులను ఇలా బెదిరించినపుడు ఇలాంటి ఓ ట్వీట్ లేదా క్షమాపణ అవసరమని అతను భావించలేదు” అని సోనా ట్వీట్ చేసింది. సల్మాన్‌ఖాన్‌ను విష పూరిత స్వభావం ఉన్న నటుడిగా సోనా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. తమ అభిమాన హీరోను సోనా తీవ్ర పదజాలంతో దూషించడాన్ని సల్మాన్ ఫ్యాన్స్ తప్పు పడుతున్నారు. తమ హీరోపై దారుణ కామెంట్ చేసిన సోనాపై సల్మాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.