సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సెలబ్రిటీల ప్రేమ, సహజీవనం, పెళ్లి, పిల్లలు, విడాకులు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంటుంది.
తాజాగా 35 ఏళ్ల ముద్దుగుమ్మ పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. చూడ చక్కటి సౌందర్యం, కలువ కళ్ల అందగత్తె కాజల్ త్వరలో ఏడడుగులు నడవనుందనే వార్తలు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి.
ఔరంగాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతోందని, వచ్చే ఏడాది పెళ్లి జరగనుందని టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని, ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా కాజల్ పెళ్లిపై వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అప్పట్లో ఆ ప్రచారాన్ని ఆమె ఖండించారు.
కాజల్ చెల్లెలైన హీరోయిన్ నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్లి చేసుకొంది. ఆమెకు పండంటి బిడ్డ కూడా జన్మించింది. ఇటీవల 35వ ఏడాదిలోకి కాజల్ అడుగు పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలే. ఆరు సినిమాలతో కాజల్ సినిమా షూటింగ్‌ల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'.. మంచు విష్ణు 'మోసగాళ్లు' చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ 'ఇండియన్ 2'.. 'హే సినామికా'లో నటిస్తోంది. హిందీలో 'ముంబయి సాగా' సినిమాలో నటిస్తోంది. ఆయా భాషల్లో అగ్రహీరోలతో నటిస్తున్న కాజల్ తన కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉన్న కాజల్ తన పెళ్లి వార్తలపై ఎలా స్పందిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.