అప్పుల బాధతో గాయని, మాజీ టీవీ నటి మద్దెల సబీరా అలియాస్ రేఖ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె వయస్సు 42 ఏళ్లు. సినిమా ఫీల్డ్ అంటే రేఖకు చిన్నప్పగి నుంచి పిచ్చి. నటి, గాయనిగా నిరూపించుకోవాలని తపించేవారు. దీంతో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. నటిగా రెండు టీవీ సీరియల్స్‌లో ఆమె నటించారు.
ఆ తర్వాత ఆమె ఆశించినట్టుగా అవకాశాలు రాలేదు. దీంతో ఉపాధి కోసం తిరిగి తన స్వస్థలమైన గుంటూరుకు ఆమె చేరుకున్నారు. అహ్మద్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె పుట్టింది. వాళ్ల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఎంతో కాలం వాళ్ల మధ్య దాంపత్య జీవితం కొనసాగలేదు. వాళ్లిద్దరూ విడిపోయారు.
ఈ నేపథ్యంలో కాజ నివాసి చైతన్యను ఆమె పెళ్లి చేసుకున్నారు. కుటుంబంతో కలిసి గుంటూరు విద్యానగర్‌లో ఉండేవారు. తనలో సహజంగా దాగి ఉన్న టాలెంట్‌ను ఉపయోగించి సాంస్కృతిక, పెళ్లి తదితర వేడుకల్లో యాంకరింగ్‌తో పాటు పాటలు పాడుతూ ఆదాయం సమకూర్చుకునేవారు. రెండేళ్లుగా ఆ అవకాశాలు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీంతో ఆమె పాటలు పాడడం మానేశారు. యాంకరింగ్‌ను కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది.
రేఖ భర్త చైతన్య చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో ఆ కుటుంబం అప్పుల పాలైంది. జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో స్నానానికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నానపు గది నుంచి భార్య ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన చైతన్య…ఈ విషయమై పట్టాభిపురం పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పట్టాభిపురం పోలీసులు వెంటనే వచ్చి స్నానపు గది తలుపులు పగులగొట్టి చూసేసరికి రేఖ ఉరితాడుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అప్పులే సబీరా అలియాస్ రేఖ ఉసురు తీశాయని పోలీసులు వెల్లడించారు.