ఏపీ ఎన్నికల కమిషనర్ బాధ్యతలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అప్పగించకూడదని సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు అయ్యింది. ఎస్ఈసీ విషయంలో తగిన నిర్ణయం తీసుకోండని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారనే వార్తల నేపథ్యంలో, ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్ ఉందని అందుకే నిమ్మగడ్డను తిరిగి నియమించకుండా ఆపాలని కోరుతూ సుప్రీం కోర్టులోనే ఇంకో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు అయ్యింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ గా అనర్హుడు అని ఇప్పటికే పలువురు కోర్టుకు ఎక్కారు. చంద్రబాబు నాయుడి సన్నిహితులతో రాసుకుపూసుకు తిరుగుతూ , హోటళ్లలో సమావేశం అయ్యే ఆయనకు ఎన్నికల కమిషనర్ గా కూర్చునే అర్హత ఎక్కడిది అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎస్ఈసీగా నియమితం అయితే నిస్ఫాక్షింగా వ్యవహరిస్తారు అనే నమ్మకాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిమ్మగడ్డ నియామకం హై కోర్టు ఉత్తర్వులకే వ్యతిరేకం అవుతుందని సుప్రీం కోర్టులో కూడా పిటిషన్లు పడ్డాయి. ఎస్ఈసీ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదని హై కోర్టు ఇటీవలే తీర్పును ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు, గవర్నర్ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ప్రకారం.. ఆయనకు ఆ పదవి దక్కదు. అయితే నియామకం విషయంలో గవర్నర్ ను వెళ్లి కలవమని నిమ్మగడ్డకు కోర్టే సూచించిందట. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు మేరకు గవర్నర్ స్పందించినట్టుగా తెలుస్తోంది.
హై కోర్టు తీర్పు ప్రకారం.. నిమ్మగడ్డ ఆ పదవికి అనర్హుడు అవుతారని, మళ్లీ ఆయననే నియమించేది ఎలా అని ప్రభుత్వం ముఖ్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారం సుప్రీంలో తేలుతుందా? లేక తనను నియమించడం లేదని మళ్లీ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయిస్తారా? అనేది శేష ప్రశ్న!