అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ (39) బుధవారం ప్రాణాలు కోల్పోయారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్తగా శిరీష్ భరద్వాజ్‌కు గుర్తింపు. 2007లో శ్రీజ-భరద్వాజ్ ప్రేమ పెళ్లి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆర్యసమాజ్‌లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని వుందని చిరంజీవి కుమార్తె సంచలన ఆరోపణ చేశారు. శ్రీజ- భరద్వాజ్ దంపతులకు ఒక కుమార్తె కూడా వుంది.
మనస్పర్థల కారణంగా విడిపోయారు. అనంతరం కల్యాణ్‌దేవ్‌ను శ్రీజ పెళ్లి చేసుకున్నారు. కల్యాణ్‌దేవ్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఇదిలా వుండగా భరద్వాజ్ కూడా 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను పెళ్లి చేసుకున్నారు. బీజేపీలో చేరిన భరద్వాజ్ కొంత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత భార్యతో కలిసి చెన్నైలో స్థిరపడ్డారు.
కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఇటీవల అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. మృత్యువుతో పోరాటంలో ఆయన ఓడిపోయారు. గుండె పోటుతో శిరీష్ భరద్వాజ్ తుదిశ్వాస విడిచినట్టు అతని స్నేహితులు తెలిపారు. ఆయన కుటుంబం శోకసంధ్రంలో మునిగింది.