ఏపీ డిప్యూటీ సీఎంగా, అలాగే పలు మంత్రిత్వశాఖల బాధ్యతలను జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ బుధవారం చేపట్టారు. ఇంత కాలం కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు మాత్రమే. తన పార్టీకి మాత్రమే ఆయన బాధ్యుడిగా వ్యవహరించారు. ఇకపై లెక్క మారింది. ప్రభుత్వంలో పవన్‌కల్యాణ్‌ది కీలక భాగస్వామ్యం. మేనిఫెస్టో అమలు బాధ్యత కూడా ఆయనపై ఉంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ …హామీలు అమలు బాధ్యతల్ని తాను, పవన్‌కల్యాణ్ తీసుకుంటున్నట్టు చెప్పారు.
మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదన్నట్టు నాడే బీజేపీ అంటీముట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. అయినప్పటికీ వాటిని ప్రజలు పట్టించుకోలేదు. కూటమి అధికారాన్ని సొంతం చేసుకుంది. చంద్రబాబు కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. టీడీపీతో సమానంగా ప్రభుత్వ నిర్ణయాల్లో ముఖ్యంగా జనసేనాని పవన్ బాధ్యత వహించాల్సి వుంటుంది.
అందుకే పవన్‌కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో కీలక కామెంట్స్ చేశారు. ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోడానికి అధికారం ఇవ్వలేదని, హామీల్ని నెరవేర్చాల్సిన బాధ్యత తమపై వుందని అన్నారు. పవన్ మాటలు చాలా మందికి నచ్చాయి. ఒక్క టీడీపీ నేతలకు తప్ప. ఎందుకంటే టీడీపీ ప్రాధాన్యతలు వేరు. ప్రత్యర్థులపై వేధింపులు, అమరావతిని చకచకా నిర్మించుకోవడం టీడీపీ ప్రాధాన్య అంశాలు.
ఈ నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, శాస్త్రసాంకేతిక శాఖల మంత్రిగా ఆయన ఏం చేస్తారో అనే ఆసక్తి అందరిలో వుంది. ఇంతకాలం ప్రజా పరిపాలన గురించి పవన్‌కల్యాణ్ గొప్పగొప్ప మాటలు చెబుతూ వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఆయన ఏం మాట్లాడినా బాధ్యత వుండేది కాదు. కానీ ఇప్పుడు వేరే. ఇంతకాలం ప్రతిపక్ష నేతగా ఓ లెక్క, అధికారంలో కీలక నాయకుడిగా మరో లెక్క.
గతంలో వాలంటీర్లు వేలాది మంది అమ్మాయిలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. ఇప్పుడలా మాట్లాడ్డానికి అవకాశం వుండదు. ప్రతి మాటను బాధ్యతగా ఆచితూచి మాట్లాడాల్సి వుంటుంది. పరిపాలనలో భాగస్వామి అయిన పవన్‌కల్యాణ్ అడుగులపై అందరి దృష్టి వుంది. ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి.