గత కొద్ది రోజులుగా సిరివెన్నెల చివరిపాట అంటూ తెగ హడావుడి చేస్తోంది శ్యామ్ సింగ రాయ్ యూనిట్. సిరివెన్నెల లాంటి మహాకవి మరణం సాహితీ లోకాన్ని, సినిమా లోకాన్ని కూడా శోకసంద్రంలో ముంచింది. అలాంటి నేపథ్యంలో సిరివెన్నెల ఆఖరి పాట అంటూ కాస్త హడావుడి చేసుకోవడం సినిమాకు కాస్త ప్లస్ అవుతుందనే ఆలోచనతో కావచ్చు.
కానీ నిజంగా సిరివెన్నెల ఆఖరిపాట ఏది? అసలు ఆఖరి పాట అంటే ఏమిటి? ముందుగా రాసి ఆఖరుగా విడుదలయినదా? లేక ఆఖరుగా రాసి ఆఖరుగా విడుదలయినదా? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సిరివెన్నెల రాసి బయటకు రావాల్సిన పాటలు ఇంకా కొన్ని వున్నాయని తెలుస్తోంది.
అయితే అవి ఎప్పుడో రాసి, సినిమాలు ఆలస్యమైన కారణంగా వుండిపోయి వుండొచ్చు. అయితే అలా కాకుండా మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా కోసం ఆయన ఆఖరి పాట రాసారని తెలుస్తోంది. ఆయన సిక్ కావడానికి కొద్ది రోజుల ముందే పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ ను దర్శకుడు మారుతి దగ్గర వుండి రాయించుకున్నారు.
మారుతి అంతకు ముందు సినిమా ప్రతి రోజూ పండగే సినిమాలో 'చిన్న తనమే చేరరమ్మంటే' అనే అద్భుతమైన పాటను సిరివెన్నెలే రాసారు. ఆ అనుబంధంతోనే మళ్లీ మరోపాటను దగ్గర వుండి రాయించుకున్నారు మారుతి. ఆ పాట ఇంకా విడుదల కావాల్సి వుంది.