మరోసారి సోనూసూద్ హీరో అయ్యారు. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహల్ రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన పెద్ద మనసుతో ముందుకు రావడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడుగా ఇద్దరు కూతుళ్లు కాడెద్దులుగా మారి విత్తనం వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఓ రైతు తన కుటుంబంతో పంట పండించేందుకు పడుతున్న కష్టం వీడియోలో ఆవిష్కృతమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రముఖ నటుడు సోనూసూద్ కంటపడింది. ఆడబిడ్డలు కాడెద్దులుగా మారిన వైనం ఆయన హృదయాన్ని కదిలించింది.
ట్విటర్ వేదికగా ఆయన వెంటనే స్పందించారు. మొదట రేపు ఉదయానికికల్లా ఆ కుటుంబానికి రెండు ఎద్దులు కొనివ్వ బోతు న్నట్టు ప్రకటించారు. మళ్లీ కాసేపటికే ఆయన మనసు మారింది. వారికి కావాల్సింది ఎద్దులు కాదని…ట్రాక్టర్ అని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రానికల్లా రైతుకు ట్రాక్టర్ కొనిస్తానని, అది ఆయన పొలంలో ఉంటుందని సోనూసూద్ ప్రకటించారు. రైతులు దేశానికి గర్వకారణమని చెబుతూనే కుమార్తెల చదువులపై దృష్టి సారించాలని రైతు నాగేశ్వరరావును సోనూ కోరారు.
ఇదిలా ఉండగా ఆ రైతు తెలుగువాడు. ఎక్కడో బాలీవుడ్ నటుడిని కదిలించిన రైతు దయనీయ జీవితం మన టాలీవుడ్ హీరోలను, హీరోయిన్లను కదిలించలేకపోయింది. టాలీవుడ్ అగ్రహీరో కమ్ ఒక పార్టీ అధినేత మూడు రోజులుగా పెద్దపెద్ద మాటలు చెబుతూ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్కో హీరో గురించి చెప్పుకుంటూ పోతే రైతు పేరుతో సినిమాలు తీసి సొమ్ము చేసుకున్న అగ్రహీరోలు లేకపోలేదు.
కానీ సేద్యం చేయడానికి కాడెద్దులు లేక కన్నకూతుళ్లకే కాడి కట్టి వ్యవసాయం చేస్తుండడం తెలుగే రాని బాలీవుడ్ నటుడిని కదిలించిందే తప్ప….టాలీవుడ్‌ను చలింపచేయలేక పోయింది. టాలీవుడ్లో ఎందుకింత స్పందనా రాహిత్యమో అర్థం కాదు. ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులే మిన్న అనే మదర్‌థెరిస్సా స్ఫూర్తిదాయక మాటలు ఈ సందర్భంగా మన హీరోలు, హీరోయిన్లు మననం చేసుకుంటే మంచిది.
కనీస అవసరాలకు కూడా నోచుకోక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను సోనూ నుంచి నేర్చుకోవాలి. అంతే తప్ప, పనికి రాని చాలెంజ్‌లతో పబ్లిసిటీ వ్యవహారాలను కట్టిపెడితే మంచిది.