ఇంట్లో సేఫ్ లాకర్స్ ఉంటాయి లేదంటే సీక్రెట్ బంకర్లు ఉంటాయి. కానీ శృతిహాసన్ ఇంట్లో పెద్ద గుహ ఉంది. అవును.. తన ఇంట్లో గుహ లాంటి నిర్మాణం ఉందని చెబుతోంది ఈ బ్యూటీ. అలా అని అది కట్టించుకున్నది కాదట, సహజసిద్ధంగా ఉన్న ఓ రాయి వల్ల ఇంట్లో గుహ వచ్చిందని చెబుతోంది.
“మా ఇంట్లో పెద్ద బండ రాయి ఉంది. దాన్ని మేం తొలిగించలేదు. ఆ రాయిని అలానే ఉంచి ఇల్లు కట్టారు. సో.. ఇప్పుడీ బండ రాయి నాది. నా డైనింగ్ రూమ్ లో ఇదొక భాగం. ఆ రాయి పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటే గుహలో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఆ రాయి ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఆ రాయి దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తుంటాను. అక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది.”
ఇలా తన ఇంటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మేటర్ ను బయటపెట్టింది శృతిహాసన్. ఇక దుస్తుల విషయానికొస్తే.. చీర కట్టుకోవడం అంటే ఈమెకు చాలా ఇష్టమంట. కానీ తనకు కట్టుకోవడం రాదంటోంది. ఈసారి కచ్చితంగా చీరకట్టు నేర్చుకుంటానని చెబుతోంది. ఎన్ని వెస్ట్రన్ ఔట్ ఫిట్స్ వేసుకున్నప్పటికీ చీర కట్టు అంటేనే తనకు చాలా ఇష్టం అంటోంది శృతిహాసన్.